హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే రూ.75 వేల కోట్ల అప్పు తెచ్చారని బీఆర్ఎస్ నేత కే వాసుదేవరెడ్డి ఆరోపించారు. ఈ అప్పులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. బుధవారం హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం అప్పులు తెచ్చి ఆస్తులు పెంచిందని చెప్పారు. ఉద్యోగులకు పీఆర్సీ, డీఏ ఇవ్వకుండా ఎవరి కోసం అప్పులు చేశారని ప్రశ్నించారు. తొమ్మిదిన్నరేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పు రూ.4,26,499 కోట్లు అని మాత్రమే అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఉదయ్ సీమ్ తీసుకొచ్చి డిస్కమ్ అప్పులను రాష్ట్ర ప్రభుత్వం టేకోవర్ చేయాలని చట్టం చేయడంతో రూ.41,159 కోట్లు చేర్చుకుని.. మొత్తం రు.3,85,340 కోట్లు అప్పులు అయ్యాయని వివరించారు. అప్పులపై ఆర్బీఐ విడుదల చేసిన నివేదికలో తెలంగాణ కింది నుంచి ఆరో స్థానంలో ఉందని చెప్పారు.
పడిపోయిన పంటల సాగు
హైదరాబాద్, సెప్టెంబర్ 11(నమస్తే తెలంగాణ) : గత సీజన్‌తో పోల్చితే ఈ వానకాలంలో పంటల సాగు 5 లక్షల ఎకరాల వరకు తగ్గినట్టు వ్యవసాయ శాఖ తెలిపింది. నిరుడు ఇదే సమయానికి 1.28 కోట్ల ఎకరాల్లో సాగు కాగా, ప్రస్తుతం 1.23 కోట్ల ఎకరాలకే పరిమితమైంది. అత్యధికంగా వరి 2.62 లక్షల ఎకరాల్లో తగ్గగా, పత్తి 1.23 లక్షల ఎకరాలకు పడిపోయింది. 43 వేల ఎకరాల్లో సోయాబీన్, 30వేల ఎకరాల్లో మొక్కజొన్న సాగు తగ్గింది. గతేడాది 6.23 లక్షల ఎకరాల్లో వరినాట్లు పడగా, ప్రస్తుతం 5.97 లక్షల ఎకరాల్లోనే సాగైంది. పత్తి గతంలో 4.45 లక్షల ఎకరాల్లో సాగు కాగా, ప్రస్తుతం 4.32 లక్షల ఎకరాల్లో వేశారు. ఈ ఏడాది వ్యవసాయ శాఖ 1.29 కోట్ల ఎకరాల్లో పంటలు సాగవుతాయని లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటి వరకు 1.23 కోట్ల ఎకరాలకే పరిమితమైంది.