కేసీఆర్, కేటీఆర్ గురించి అడ్డగోలుగా మాట్లాడితే నాలుక చీరేస్తానని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరిని బీఆర్ఎస్ నేత తాటికొండ రాజయ్య హెచ్చరించారు. నక్కజిత్తులమారివి, వెన్నుపోటుదారుడివి, అవకాశవాదివి అయిన నువ్వా కేసీఆర్, కేటీఆర్ గురించి మాట్లాడేదని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో ఆదివారం తాటికొండ రాజయ్య మీడియాతో మాట్లాడుతూ.. కడియం శ్రీహరి శుద్ధపూసలా మాట్లాడటం గురవింద నీతిని గుర్తుచేస్తుందని విమర్శించారు.
బీఆర్ఎస్ టికెట్‌తో గెలిచిన కడియం శ్రీహరి దమ్ముంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలని తాటికొండ రాజయ్య సవాలు విసిరారు. నక్కజిత్తులమారి కడియం శ్రీహరికి కేసీఆర్ ఏం తక్కువ చేశారని బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్‌లో చేరారని ప్రశ్నించారు. కడియం శ్రీహరిని కేసీఆర్ ముందు బెంచిలో కూర్చొబెడితే.. కాంగ్రెస్‌లో చేరి వెనుక బెంచిలో కూర్చునే స్థాయికి వచ్చారని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ప్లాఫ్ అయ్యిందని.. ఆరు గ్యారెంటీలను అటకెక్కించిందని అన్నారు. స్థాయి మరిచి కేసీఆర్‌ను విమర్శిస్తే ఊరుకోబోమని రాజయ్య హెచ్చరించారు.