హైదరాబాద్, అక్టోబర్ 28 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తండ్రి సత్యనారాయణరావు (75) మృతిచెందారు. కొన్నిరోజులుగా వృద్ధాప్య సమస్యలు, అనారోగ్యంతో బాధపడుతున్న సత్యనారాయణరావు.. స్థానిక ఏఐజీ దవాఖానలో చికిత్సపొందుతూ మంగళవారం తెల్లవారుజామున 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఉమ్మడి రాష్ట్రంలో వైద్యారోగ్య శాఖలో పలు హోదాల్లో ఆయన పనిచేశారు. ఆయనకు భార్మ లక్ష్మి, కుమారులు హరీశ్‌రావు, మహేశ్ ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు ఆయన స్వయాన బావ. కేసీఆర్ 7వ అక్క లక్ష్మికి భర్త. సత్యనారాయణరావు మరణంతో స్వస్థలం కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో, కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. సత్యనారాయణరావు పార్థివదేహాన్ని హైదరాబాద్ కోకాపేటలోని హరీశ్‌రావు నివాసంలో ప్రజల సందర్శనార్థం ఉంచారు. నివాళులు అర్పించడానికి వారి బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో వచ్చా రు. అనంతరం సత్యనారాయణరావు అంతిమ సంస్కారాలను మంగళవారం మధ్యాహ్నం జూ బ్లీహిల్స్లోని మహాప్రస్థానంలో నిర్వహించారు.

పాడె మోసిన కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తన మేనత్త భర్త సత్యనారాయణరావు మృతి వార్త తెలిసిన వెంటనే హరీశ్‌రావు నివాసానికి చేరుకొని, వారి కుటుంబసభ్యులను ఓదార్చారు. అంత్యక్రియలు పూర్తయ్యేవరకూ వారి కుటుంబసభ్యులతోనే గడిపారు. సత్యనారాయణరావు అంతిమయాత్ర సందర్భంగా పాడెను మోశారు. గౌరవ సూచకంగా.. మంగళవారం నాటి బీఆర్ఎస్ కార్యక్రమాలన్నింటినీ, జూబ్లీహిల్స్ ఉప ఎ న్నిక ప్రచార కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.

బీఆర్ఎస్ నేతల సంతాపాలు
హరీశ్‌రావు తండ్రి మరణ వార్త తెలుసుకొని పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు కోకాపేటలోని ఆయన ఇంటికి చేరుకొని తమ ప్రగాఢ సంతాపాన్ని ప్రకటించారు. మాజీ మంత్రులు జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, సబితాఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, తాటికొండ రాజయ్య, వీ శ్రీనివాసగౌడ్, ఎర్రబెల్లి దయాకర్‌రావు, జోగు రామన్న, మహమూద్ అలీ, శాసనమండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్, మాజీ డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, పార్లమెంట్లో బీఆర్ఎస్ పక్ష నేత కే ఆర్ సురేశ్‌రెడ్డి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు, ‘నమస్తే తెలంగాణ’ సీఎండీ దివకొండ దామోదరరావు, మాజీ ఎంపీలు సంతోష్‌కుమార్, బడుగల లింగయ్యయాదవ్, రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కల్వకుంట్ల సంజయ్, పల్లా రాజేశ్వర్‌రెడ్డి, పాడి కౌశిక్‌రెడ్డి, కేపీ వివేకానందగౌడ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కోవా లక్ష్మి, మాధవరం కృష్ణారావు, సుధీర్‌రెడ్డి, కాలేరు వెంకటేశ్, బండారు లక్ష్మారెడ్డి, కాలె యాదయ్య, చింతా ప్రభాకర్, కే మాణిక్‌రావు, ఎమ్మెల్సీలు గోరటి వెంకన్న, శంభీపూర్ రాజు, వెంకట్రామిరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, కే నవీన్‌కుమార్, దేశపతి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు బాల్కసుమన్, శ్రీశైలంయాదవ్, రసమయి బాలకిషన్, జైపాల్‌యాదవ్, వెంకటేశ్వర్‌రెడ్డి, షకీల్, ఏ జీవన్‌రెడ్డి, ఏనుగు రవీంద్‌రెడ్డి, రవీంద్రకుమార్‌నాయక్, పుట్ట మధు, దాస్యం వినయ్‌భాస్కర్, మెతుకు ఆనంద్, పెద్ది సుదర్శన్‌రెడ్డి, క్రాంతికిరణ్, మాజీ ఎమ్మెల్సీలు కర్నె ప్రభాకర్, శేరి సుభాష్‌రెడ్డి, యెగ్గె మల్లేశం, నారదాసు లక్ష్మణ్‌రావు, బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తదితరులు సత్యనారాయణరావు పార్ధివదేహాన్ని సందర్శించి సంతాపాలు తెలియజేశారు.
సీఎం రేవంత్‌రెడ్డి సంతాపం
హరీశ్‌రావు తండ్రి మరణం పట్ల ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్, కౌన్సిల్ చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార, మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్‌బాబు, వివేక్‌వెంకటస్వామి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దామోదర రాజనర్సింహ, శాసనమండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ సలహాదారు కే కేశవరావు, ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్, మంత్రి నారా లోకేశ్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, మాజీ మంత్రి విడదల రజని తదితరులు సంతాపాలు తెలియజేశారు. కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, రఘునందన్‌రావు, ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి, బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు, మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, మీడియా అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ, సినీ దర్శకుడు, నటుడు ఆర్ నారాయణమూర్తి, ఎన్నారై గ్లోబెల్ సెల్ కోఆర్డినేటర్ మహేశ్ బిగాల తదితరులు సంతాపాలు తెలియజేశారు. పార్టీలకు అతీతంగా సత్యనారాయణరావు మృతదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. మహాప్రస్థానంలో జరిగిన అంత్యక్రియలకు హాజరయ్యారు.

సంతాపం తెలిపిన కేసీఆర్
సత్యనారాయణరావు మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. తన బావ మృతి వార్త తెలిసిన వెంటనే హరీశ్‌రావుకు ఫోన్ చేసి ఓదార్చారు. అనంతరం ఎర్రవల్లిలోని నివాసం నుంచి బయల్దేరి హైదరాబాద్‌లోని హరీశ్‌రావు నివాసానికి చేరుకున్నారు. సత్యనారాయణరావు పార్థివదేహంపై పుష్పగుచ్ఛాలుంచి నివాళులర్పించారు. భర్త మృతితో తీవ్ర దుఃఖంలో ఉన్న తన అక లక్ష్మిని, మేనల్లుళ్ల్లు హరీశ్‌రావు, మహేశ్‌ను ఓదార్చారు. వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ సందర్భంగా తమ ఇద్దరి మధ్య ఉన్న ఆత్మీయ అనుబంధాన్ని అక్కడే ఉన్న తన అక్కచెల్లెళ్లతో గుర్తుచేసుకున్నారు. సత్యనారాయణరావు ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. కేసీఆర్‌తోపాటు ఆయన సతీమణి శోభమ్మ కూడా హరీశ్‌రావు నివాసానికి చేరుకొని వారిని ఓదార్చారు.
పాడె మోసిన మాజీ మంత్రి ఎర్రబెల్లి
బీఆర్ఎస్ నాయకుడు, మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండల రైతు బంధు మాజీ కన్వీనర్ పాకనాటి సోమారెడ్డి సోమవారం మృతి చెందగా, మంగళవారం స్వగ్రామమైన చిన్నవంగరలో అంత్యక్రియలు నిర్వహించారు. మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆయన భౌతికకాయంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన అంత్యక్రియల్లో ఆయన పాడె మోశారు. పార్టీకి ఆయన చేసిన సేవలను గుర్తుచేసుకుంటూ కన్నీటి పర్యంతమయ్యారు.