Tirumala | తిరుమలలో శ్రీవారి దర్శనానికి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించకపోవడంపై మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ మరోసారి అసహనం వ్యక్తం చేశారు. తెలంగాణ ఆలయాల్లో అందర్నీ సమానంగా చూస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. తిరుమలలోనూ అందర్నీ సమానంగా చూడాలని విజ్ఞప్తి చేశారు.
గద్వాల నియోజకవర్గంలోని జములమ్మ అమ్మవారిని ఆదివారం నాడు మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. అనంతరం గద్వాల బీఆర్ఎస్ నాయకుడు బాసు హనుమంత నాయుడు నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు ఆంధ్రా ప్రాంతంతో ఉన్న ఏకైక సంబంధం తిరుపతి అని తెలిపారు. తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డ కూడా తిరుమల శ్రీవారిని దర్శించుకుని తలనీలాలు సమర్పించుకోవాలని అనుకుంటారని పేర్కొన్నారు. తిరుమల బ్రహ్మోత్సవాలకు గద్వాలలో నేసిన పట్టుచీరను సమర్పించడం ఆనవాయితీగా వస్తున్న విషయాన్ని గుర్తుచేశారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా హైదరాబాద్లోనే ఉంటారని తెలిపారు.
ఇప్పటివరకు తెలంగాణ, ఏపీ అనే తేడా లేకుండా తిరుమలలో శ్రీవారి దర్శనాలు కల్పించారని శ్రీనివాస్ గౌడ్. కానీ ఇప్పుడు తెలంగాణ భక్తులు, రాజకీయ నాయకులపై వివక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. సడెన్గా సిఫారసు లేఖలు ఆపితే భేదాభిప్రాయాలు వస్తాయని పేర్కొన్నారు. తక్షణమే తెలంగాణ ప్రజా ప్రతినిధుల సిఫారసు లేఖలను అనుమతించాలని టీటీడీని కోరారు. దేవుడి దగ్గర అంతా సమానమేనని.. దీంట్లో రాజకీయం ఏమీ లేదని ఆయన స్పష్టం చేశారు.