పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు ద్వారా ఇప్పట్లో నీళ్లు వచ్చే పరిస్థితి లేదని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డిని పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన 90 శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. పంపులు రెడీగా ఉన్నా రిజర్వాయర్లు నింపడం లేదని పేర్కొన్నారు. కేంద్రం నుంచి అనుమతులు తెచ్చే ప్రయత్నం కూడా చేయడం లేదని విమర్శించారు.
అక్రమ కేసులు, అరెస్టులు, డైవర్షన్ పాలిటిక్స్‌పైనే ప్రభుత్వం శ్రద్ధ పెట్టిందని శ్రీనివాస్ గౌడ్ విమర్శించారు. అభివృద్ధిపై మాత్రం ఈ ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదని అన్నారు. కాల్వలు ఉన్నా.. మోటార్లు సిద్ధంగా ఉన్నా పంపులను మాత్రం ఆన్ చేయడం లేదని తెలిపారు. కావాలనే పాలమూరు ప్రాజెక్టును ప్రభుత్వం చిన్నచూపు చూస్తుందని మండిపడ్డారు. కేంద్రం అనుమతి ఇవ్వకపోవడంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని ఆరోపించారు. తెలంగాణకు రావాల్సిన అనుమతులను ఏపీ ప్రభుత్వం అడ్డుకుంటుందని అన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తయితే పాలమూరు సస్యశ్యామలం అవుతుందని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అనుమతులు నిలిపివేయడం చాలా బాధాకరమని తెలిపారు. కృష్ణా ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేసి ప్రాజెక్టును అడ్డుకోవడం సరికాదని హితవు పలికారు. కేంద్రంతో కొట్లాడి పాలమూరు ప్రజలకు న్యాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.