Harish Rao | రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల జాప్యంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకులు హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో వరి పంటకు మద్దతు ధరకు అదనంగా రూ.500 బోనస్ ఇచ్చి ధాన్యం కొంటున్నట్లు మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి గప్పాలు కొట్టారని విమర్శించారు.
ధాన్యం సకాలంలో కొనడం, మద్దతు ధరకు 500 బోనస్ ఇవ్వడం అంటే.. మభ్య పెట్టి, అబద్ధాలు చెప్పి, తిమ్మిని బమ్మిని చేసి అధికారంలోకి రావడం కాదు రేవంత్ రెడ్డి అని సూచించారు. రైతులు రోడ్డు ఎక్కకుండా ఇచ్చిన మాట ప్రకారం మద్దతు ధర పై 500 బోనస్ ఇచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు.
కాగా, ధాన్యం కొనుగోలు చేయాలని నల్లగొండ జిల్లాలోని నార్కట్‌పల్లి-అద్దంకి ప్రధాన రహదారిపై రైతులు ఆదివారం ఆందోళన చేపట్టారు. వేములపల్లి వద్ద రోడ్డుపై పడుకొని నిరసన తెలిపారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. మిల్లర్లు సిండికేట్‌గా ఏర్పడి ధాన్యం కొనుగోలు చేయడం లేదంటూ రైతులు ఆరోపించారు. మద్దతు ధరకు ధాన్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు.