హైదరాబాద్, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : పునరావాస చట్టం-2013పై కాంగ్రెస్ చెప్తున్న నీతులు నిజమే అయితే, తెలంగాణ రాష్ట్రంలో రేవంత్‌రెడ్డి పాలనలో సాగుతున్న దాష్టీకాలను చూడాలని బీఆర్ఎస్ హైదరాబాద్ ఇన్చార్జి దాసోజు శ్రవణ్ శనివారం ఎక్స్ వేదికగా రాహుల్‌గాంధీకి విజ్ఞప్తి చేశారు. ఆ చట్టాన్ని ఉల్లంఘించి తన అల్లుడి కంపెనీ విస్తరణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి గిరిజనుల భూములు లాక్కుంటున్నారని ఆరోపించారు. ‘అభివృద్ధి పేరుతో కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గంలోని గిరిజనులు, దళితులు, పేద వర్గాలకు చెందిన పట్టా భూములను బలవంతంగా స్వాధీనం చేసుకుంటున్నారు. నిరుపేదలను జీవనోపాధి నుంచి దూరం చేస్తుండటం బాధాకరం. అంతకంటే దురదృష్టకరం ఏమిటంటే.. దీని వెనుక ఉద్దేశం సీఎం అల్లుడి, ఆయన అనుచరుల ప్రయోజనాలు కాపాడేందుకేనని వార్తలు వెల్లడిస్తున్నాయి’ అని దాసోజు పేర్కొన్నారు.