కాంగ్రెస్ నేతలకు పోలీసులు బానిసలు కావద్దని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పోలీసులు తమ గౌరవాన్ని కాపాడుకోవాలని హితవుపలికారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో నేరాలు, హత్యలు పెరిగాయయని విమర్శించారు. అసలు రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నారో లేదో కూడా తెలియడం లేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఎద్దేవా చేశారు.
జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో లకావత్ శ్రీను ఆత్మహత్యకు కారణమైన పోలీసులను సర్వీసు నుంచి తప్పించాలని సత్యవతి రాథోడ్ డిమాండ్ చేశారు. దీపావళి పండుగకు ముందే తెలంగాణ పాలిటిక్స్‌లో రెండు మూడు పొలిటికల్ బాంబులు పేలబోతున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకూ సత్యవతి రాథోడ్ కౌంటరిచ్చారు. కాంగ్రెస్ నేతలపైనే బాంబులు పడతాయని విమర్శించారు. ఫోన్ ట్యాపింగ్‌తో ఎవరి కొంపలు మునిగాయో ఇంతవరకు ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు.
ఇక సీఎం రేవంత్ రెడ్డి కౌంట్‌డౌన్ మొదలైందని మాజీ స్పీకర్ మధుసూదనచారి అన్నారు. పోలీస్ స్టేషన్లు కాంగ్రెస్ ఆఫీసుల్లా మారిపోయాయని విమర్శించారు. దుర్మార్గపు పాలనతో కాంగ్రెస్ నాయకులు ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని మండిపడ్డారు. కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని అన్నారు.