Satish Reddy | హైదరాబాద్ : మేడారం సమ్మక్క – సారక్కల మీద ప్రమాణం చేసి ప్రతీ రైతుకి రూ. 2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పిన ఏకైక ముఖ్యమంత్రివి నువ్వే రేవంత్ రెడ్డి అని బీఆర్ఎస్ నాయకుడు వై సతీశ్ రెడ్డి మండిపడ్డారు. మాట తప్పిన నువ్వు ఏం ముఖం పెట్టుకొని మేడారం పోయావ్ అని సీఎంను ఆయన నిలదీశారు. తెలంగాణ భవన్లో సతీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
రామప్ప శివుడి సాక్షిగా, వెయ్యి స్తంభాల గుడి సాక్షిగా రేవంత్ రెడ్డి మాట ఇచ్చారు. ఆగస్టు 15 లోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తామని రేవంత్ రెడ్డి మాట తప్పారు. మళ్లీ ఏ మొహం పెట్టుకుని రేవంత్ రెడ్డి మేడారం వెళ్లారు అని నిలదీశారు. ములుగు నియోజకవర్గంలో నాలుగు గ్రామాల్లో సర్వే చేస్తే మంత్రి సీతక్క గ్రామం పక్కన గ్రామాల్లో సైతం రుణమాఫీ కాలేదు అని పేర్కొన్నారు.
గ్రామాల్లో 50 శాతం రుణమాఫీ కాలేదు. రేవంత్ రెడ్డి మేడారం గద్దెల వద్ద పొర్లుదండాలు పెట్టి క్షమించమని కోరాలి. పొర్లు దండాలు రేవంత్ రెడ్డి పెట్టాలి. మేడారం గద్దెలను ఆధునీకరించడం కాదు మేడారంలో రైతులకు రుణమాఫీ అయిందా..? కాంగ్రెస్ ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు కాలేదు. మేడారం తల్లుల ఆగ్రహానికి అప్పట్లో చెట్లు కూలిపోయాయి. సీఎం రేవంత్ రెడ్డి మళ్ళీ వచ్చారు. మేడారం తల్లుల ఆగ్రహం ఈ సారి ఎట్లా ఉంటుందో అని ములుగు ప్రజలు చర్చించుకుంటున్నారు అని వై సతీశ్ రెడ్డి పేర్కొన్నారు.