RS Praveen Kumar | హైదరాబాద్ : దేశంలో ఫోన్ ట్యాపింగ్ మొదలుపెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని బీఆర్ఎస్ సీనియర్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ కాంగ్రెస్ మంత్రులు, నాయకులు సిగ్గు లేకుండా ఫోన్ ట్యాపింగ్ అంశం గురించి అడ్డగోలుగా మాట్లాడడం వింతగా ఉందన్నారు. తెలంగాణ భవన్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
బీజేపీ పార్టీలో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి వంత పాడే ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డిని ఎవరు పిలవకపోయినా.. నా ఫోన్ ట్యాప్ అయ్యిందని కామెడీ చేస్తున్నాడు. ఈ ఫోన్ ట్యాపింగ్ విచారణ చేస్తారు పోలీస్ అధికారులా? గాంధీ భవన్లో ఉండే కాంగ్రెస్ మంత్రులు, యూత్ కాంగ్రెస్ నాయకులా? ఏది వాస్తవమో.. ఏది అవాస్తవమో.. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్‌లో ప్రెస్‌మీట్ పెట్టి ప్రజలకు తెలియజేయండి అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
హైకోర్టు ఆదేశాలను తుంగలో తొక్కుతూ.. హోం మంత్రిగా బాధ్యతగల పదవిలో ఉంటూ సీఎం రేవంత్ ఇస్తున్న ఆదేశాలతో వారి అనుంగు మీడియాతో తప్పుడు రాతలపై, పిచ్చి కూతలు, దొంగ లీకులతో వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు. మహా టీవీతో పాటు మరికొన్ని వార్తా సంస్థలు, యూట్యూబ్ ఛానెల్‌లు అడ్డగోలుగా అసత్యాలు ప్రచారం చేస్తున్నారు. వారందరిపై పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలి అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ డిమాండ్ చేశారు.
రేవంత్ ఆదేశాలతో మా బీఆర్ఎస్వీ నాయకుడు గెల్లు శ్రీనివాస్‌పై అక్రమ కేసులు బనాయించిన పోలీసులు.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై, మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై అడ్డగోలుగా, అశ్లీలంగా, జుగుప్సాకరమైన వార్తలు రాసిన మహా టీవీపై తెలంగాణ పోలీసులు సుమోటోగా కేసు పెట్టాలి. నిన్న మా బీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి మహా టీవీపై ఫిర్యాదు చేయడానికి వెళ్ళితే.. తొలుత ఫిర్యాదు తీసుకోకపోతే, బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తే అయిష్టంగా పోలీసులు ఫిర్యాదు తీసుకుంటున్నారు అని ఆయన పేర్కొన్నారు.
రాజ్యాంగబద్ధంగా, రాజకీయాలకు అతీతంగా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు, ప్రజాసమస్యలను కాపాడాల్సిన పోలీసులు. నేడు 80-90 కేసుల నేర చరిత్రతో పాటు ఓటుకు నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా కెమెరాల ముందు దొరికిన ఒక దొంగ మాటలు విని హేయమైన పాత్ర పోషిస్తున్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సొంత ప్రభుత్వ మంత్రులైన పొంగులేటి, కొండా సురేఖలతో పాటు ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాపింగ్ చేస్తుండడం నిజం కాదా? అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ప్రశ్నించారు.