తండ్రి అంచనాలను తల్లకిందులు చేయడమే కాకుండా, తండ్రికి కావాల్సినంత పుత్రికోత్సాహాన్ని కూడా అందించింది మలయాళ మందారం కల్యాణి ప్రియదర్శన్. మలయాళ దిగ్దర్శకుడు ప్రియదర్శన్ గారాలపట్టి అయిన కల్యాణికి, అసలు యాక్ట్రస్ అవ్వాలనే ఆలోచనే లేదట. ఆర్కిటెక్ట్ కావాలనేది ఆమె డ్రీమ్ అట. అయితే.. అనుకోకుండా నటిగా మారింది.
అంతేకాదు, తానే ప్రధాన పాత్రగా రూపొందిన లేడీ ఓరియెంటెడ్ థ్రిల్లర్ ‘కొత్త లోక’తో బాక్సాఫీస్ వద్ద సన్సేషన్ క్రియేట్ చేసి, దాదాపు 300కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. దక్షిణాదిన ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమాకు ఈ స్థాయిలో వసూళ్లు రావడం ఓ రికార్డ్. మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. కల్యాణి నటిగా మారింది తెలుగు సినిమాతోనే. అది ఎలా జరిగిందో ప్రియదర్శన్ చెబుతూ ‘కల్యాణి సినిమాల్లో రాణిస్తుందని నేనస్సలు అనుకోలేదు. సెట్స్‌కి రావడానికి కూడా తను ఇష్టపడేది కాదు.
కేరళంలో పెరగకపోవడంతో తనకు మలయాళం కూడా సరిగ్గా రాదు. ఆర్కిటెక్ట్ కావడం ఆమె గోల్. అయితే.. ఓ రోజు అక్కినేని నాగార్జున నాకు కాల్ చేశారు. తన కుమారుడు అఖిల్ హీరోగా రూపొందుతున్న ‘హలో’ సినిమాలో హీరోయిన్గా కల్యాణిని అడిగారు. తనకు నటన రాదని కరాఖండీగా చెప్పేశాను. అయితే.. కల్యాణి మాత్రం చేస్తానంది. ‘ఒక్కసారి ట్రై చేస్తా నాన్నా.. పోయేదేముంది.. కుదరకపోతే ఆర్కిటెక్ట్‌గా నా ప్రయత్నాలు నాకెలాగూ ఉన్నాయికదా..’ అని నచ్చజెప్పింది. దాంతో తప్పక ఒప్పుకున్నా. కానీ నా అంచనాలు తారుమారు చేస్తూ పెద్ద స్టార్‌గా ఎదిగింది. ఈ విషయంలో నా కూతుర్ని చూస్తుంటే గర్వంగా ఉంటుంది’ అన్నారు ప్రియదర్శిన్.