RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ దంపతుల భేటీపై బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ తీవ్ర విమర్శలు చేశారు. బారా ఖూన్ మాఫ్ అంటే ఇదే అని విమర్శించారు. లోలోపల సీఎం సమక్షంలో గెస్ట్ హౌస్ లలో సెటిల్ మెంట్లు ఎవరు ఎన్నైనా చేసుకోవచ్చని.. వాటాల్లో తేడాలొస్తే, బజారుకు ఎక్కితే మాత్రం టాస్క్ ఫోర్స్ రంగంలోకి దిగుతదని వ్యాఖ్యానించారు.
ఫైనల్‌గా మ్యాటర్ సెటిల్ అయితే ఇదిగో ఇలా మర్యాద చేసి ఎవరి వాటా వాళ్లకు అప్పగించబడుతుందని విమర్శిస్తూ.. సీఎం రేవంత్ రెడ్డిని కొండా సురేఖ దంపతులు కలిసిన వీడియోను ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సోషల్‌మీడియాలో పోస్టు చేశారు. ఇక ఈ వివాదంలో సుమోటో కేసు లేదు, అరెస్ట్ లేదు, చర్యలు లేవని పేర్కొన్నారు. మంత్రి కూతురు ఎన్ని ఆరోపణలు చేసినా, సుమంత్ ఎన్ని వసూలు చేసినా, రోహిన్ రెడ్డి గన్‌తో బెదిరించినా సీఎం-హోం మంత్రికి ఒక్క ‘శాలువ’ కప్పుతే అంతా సర్దుకుంటుందని ఎద్దేవా చేశారు.
తెలంగాణలోని సమస్త నేరచరితులారా, ఏడవకండేడవకండి… జైళ్లలో మగ్గుతున్న నిందితులారా, ఇక కోర్టులు వకీళ్ల చుట్టూ తిరగకండి అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సూచించారు. వెంటనే చక్కటి శాలువాలు కొనుక్కొని సీఎం గారిని సత్కరించండి, విముక్తి పొందండని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. మరిన్ని వివరాలకు మహేశ్ కుమార్ గౌడ్, కొండా దంపతులను సంప్రదించండని సూచించారు.