RS Praveen Kumar | హైదరాబాద్ : సమీకృత గురుకులాలకు తాను అడ్డు పడుతున్నట్టు రేవంత్ రెడ్డి దుష్ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. గురుకులాలు ఆది నుంచి సమీకృతమే. ఆ విషయం రేవంత్ రెడ్డికి తెలియనందుకు బాధపడుతున్నాను అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హైదరాబాద్లో మీడియాతో మాట్లాడారు.
1971లో పీవీ నర్సింహారావు గురుకులాలను ఏర్పాటు చేసినా.. ఆ గురుకులాలకు కొనసాగింపుగా కేసీఆర్ 3 రెట్లు పెంచిన గురుకులాలన్నీ సమీకృతమే. ఇవాళ రాష్ట్రంలో ఉన్న గురుకులాలన్నీ కూడా సమీకృతమే. ఈ విషయం రేవంత్ రెడ్డికి తెలియనందుకు ఒక తెలంగాణ బిడ్డగా నేను బాధపడుతున్నాను. సమీకృతానికి తాను వ్యతిరేకం కాదు. ఆల్రెడీ సమీకృతంగా ఉన్న వ్యవస్థను కొత్త సీసాలో పాత సార పోసినట్టు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్న ప్రక్రియకు తాను వ్యతిరేకం. 640 మంది విద్యార్థులే ఒకచోట సరిగా ఉండలేకపోతున్నారు. వారికి సరిగా తిండి దొరకడం లేదు. 2500 మంది విద్యార్థులను ఒకే చోటకు తీసుకొస్తే చాలా సమస్యలు వస్తాయి. దీనికి బెస్ట్ ఉదాహరణ బాసర ట్రిపుల్ ఐటీ అని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
విద్యావ్యవస్థను బలోపేతం చేయాలనుకుంటే.. ఇప్పుడున్న గురుకులాల్లో మౌలిక వసతులు కల్పించండి.. నిధులు కేటాయించి మరింత బాగు చేయండి. రేవంత్ ఆలోచిస్తున్న విధానానికి వ్యతిరేకం. కాంగ్రెస్ పార్టీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ సెల్స్ ఉంటాయి. మరి గురుకులాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు ఉంటే తప్పేంటి..? గురుకులాల చరిత్ర రేవంత్ రెడ్డి తెలుసుకోవాలి. గురుకులాల్లో ఒకటే కులం ఉండదు. అన్ని కులాలు, మతాల విద్యార్థులు కలిసే ఉన్నారు. రేవంత్ రెడ్డిని అధికారులు తప్పుదోవ పట్టిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకులాల్లో ఓసీలు చదువుకుంటున్నారు. మైనార్టీ గురుకులాల్లో కూడా వెలమ పిల్లలు చదువుకుంటున్నారు. గిరిజన సంక్షేమ హాస్టళ్లలో కూడా బ్రాహ్మణ, వైశ్య కులాలకు చెందిన పిల్లలు చదువుకుంటున్నారు. కావాలంటే రికార్డులు తీసి చూడండి. అంతే తప్ప గురుకులాల్లో ఒకటే కులం ఉంటదనేది అభూతకల్పన. అసత్యాలను ప్రచారం చేసి కేసీఆర్ మీద దుమ్మెత్తి పోసేందుకు రేవంత్ రెడ్డి యత్నిస్తున్నాడు. దాన్ని నేను అడ్డుకుంటున్నాను అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు.
ఇవి కూడా చదవండి..
Jagityala | జగిత్యాల ఫారెస్ట్ ఆఫీస్లో వన్య ప్రాణుల మాంసంతో అధికారుల దావత్ ?
Taliperu river | పండుగపూట విషాదం.. తాలిపేరు నదిలో స్నానానికి వెళ్లి ఇద్దరు యువకులు మృతి
TGPSC | గ్రూప్-3 అభ్యర్థులకు కీలక అప్డేట్.. అరగంట ముందే గేట్లు బంద్