RS Praveen Kumar | హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డి పాలనపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఇప్పటికే టీచర్లకు సరిగా జీతాలు ఇవ్వని కాంగ్రెస్ సర్కార్.. గురుకులాల అద్దె భవనాలకు బిల్లులు చెల్లించకపోవడంతో.. గేట్లకు తాళాలు వేస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఘటనపై బీఆర్ఎస్ నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు.
రోమ్ నగరం తగలబడి పోతుంటే కోటలో కూర్చొని ఫిఢేలు వాయించినట్లుగా తెలంగాణలో రేవంత్ రెడ్డి పాలన ఉందని ఆర్ఎస్పీ విమర్శించారు. ఉదాహరణకు.. సోమవారం ఉదయం వనపర్తి జిల్లాలో గురుకుల డిగ్రీ కళాశాల, పెద్దమందడి పాఠశాలలకు గత తొమ్మిది నెలలుగా అద్దె చెల్లించలేదు. దీంతో బిల్డింగ్ ఓనర్ వందల మంది పిల్లలు లోపల ఉండగానే బయటనుండి తాళం వేసుకొని పోయాడు. కిరాయి చెల్లిస్తేనే ఉపాధ్యాయులను లోపలికి పోనిస్తాను అంటున్నడంట! మరోవైపు ముఖ్యమంత్రి గారేమో హైడ్రా మత్తులో మునిగితేలుతున్నరు! అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ నిప్పులు చెరిగారు.
సీఎం రేవంత్ రెడ్డి గారూ.. పేదల ఇళ్లను కూల్చి రాక్షసానందం పొందడం కాదు.. దమ్ముంటే ప్రజల్లో తిరిగి వాళ్ల కన్నీళ్లు తుడవండని సూచించారు. లేకపోతే త్వరలోనే ప్రజలు మిమ్మల్ని సచివాలయంలో పెట్టి బయటనుండి తాళమేసే రోజులు వస్తాయని ఆర్ఎస్పీ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
Jagadish Reddy | తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయం : జగదీష్ రెడ్డి
KCR | బతుకంతా తెలంగాణ కోసమే అర్పించిన అక్షర తపస్వి కాళోజీ: కేసీఆర్