నల్లగొండ : బీఆర్ఎస్ బి ఫామ్ పై గెలిచి, పార్టీ మారిన ద్రోహులకు చెంప పెట్టులా హైకోర్టు తీర్పు వచ్చింది.
ప్రజాస్వామ్యం పై నమ్మకం పెరిగేలా కోర్టు(High Court) తీర్పు ఉంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish Reddy) అన్నారు. నల్లగొండ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజాకోర్టులో కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారు. వారిపై అనర్హత వేటు పడటం ఖాయమన్నారు. తెలంగాణలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని పేర్కొన్నారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గులాబీ జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు. ఇక హైడ్రా పేరుతో రేవంత్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను దెబ్బతీస్తున్నడు. హైదరాబాద్ అంటేనే భయపడేలా చేసిండు. చట్టప్రకారం కాకుండా అడ్డగోలుగా బొల్డోజర్లతో రాజకీయాలు చేస్తున్నాడని విమర్శించారు. రాజకీయ కక్ష సాధింపు చేస్తూ హైడ్రామా అడుతున్నాడు. రేవంత్ చర్యలు రాజ్యాంగ వ్యతిరేకంగా ఉన్నయని మండిపడ్డారు. అసలు చెరువులు ఎన్ని? వాటి హద్దులు ఎన్ని? అని నిర్ణయం జరగాలి. పేదలకు ఎలాంటి ఇబ్బందులు రావొద్దు. బడా బడా బాబుల విషయంలో ఒకలా పేదల విషయంలో ఒకలా కాంగ్రెస్ వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.