హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ హయాంలో గురుకులాలు, సంక్షేమ హాస్టళ్ల స్థితిగతులపై, నేటి కాంగ్రెస్ పాలనలో ఉన్న స్థితిగతులపై బహిరంగ చర్చకు సిద్ధమా? అని సీఎం రేవంత్‌రెడ్డిని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ సవాల్ విసిరారు. ‘నేను పూర్తి డాటా తీసుకొస్తా.. మీరూ తీసుకురండి.. తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద చర్చిద్దాం.. ఇందుకు మీరు రెడీనా?’ అని ప్రశ్నించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో ఆదివారం బీఆర్ఎస్ నేతలు బాల్క సుమన్, ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, నాయకుడు రవీందర్‌రెడ్డితో కలిసి ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు.
కేసీఆర్ హయాంలోనే సన్నబియ్యంతో వారానికి రెండు సార్లు మటన్, నాలుగుసార్లు చికెన్, ఐదు కోడిగుడ్లు పెట్టామని చెప్పారు. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషియన్ ఆదేశాల మేరకు విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించామని తెలిపారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యార్థులు విషతుల్య ఆహారం తిని అస్వస్థతకు గురవుతున్నారని, ఏడాది పాలనలోనే 53 మంది విద్యార్థులు చనిపోయారని ఆవేదన వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ఫైవ్‌మెన్ కమిటీ ఆధ్వర్యంలో గురుకుల బాట నిర్వహించామని, క్షేత్రస్థాయిలో పరిశీలించిన అంశాలతో నివేదికను పార్టీ అధినేత కేసీఆర్‌కు సమర్పించామని చెప్పారు.
బీఆర్ఎస్ఎల్పీలో నివేదికపై చర్చించామని, సోమవారం నుంచి జరిగే అసెంబ్లీ సమావేశాల్లో గురుకులాలు, హాస్టళ్ల దుస్థితిపై బీఆర్ఎస్ నిలదీస్తుందని రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వెన్నులో వణుకు పుట్టిందని, ఆ భయంతోనే శనివారం సీఎంతోసహా మంత్రులు విద్యార్థులతో పిక్నిక్ కార్యక్రమం నిర్వహించారని మండిపడ్డారు. గురుకుల బాటలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో సమస్యలను సేకరించామని చెప్పారు. గురుకుల బాటకు వెళ్తే తమపై కేసులు పెట్టారని, పాఠశాలలకు వెళ్లకుండా బోర్డులు పెట్టించారని తెలిపారు. మంత్రులు వచ్చిన రోజు తల్లులనే అనుమతించాలని ప్రభుత్వం ప్రిన్సిపాళ్లకు మెసేజ్ పంపిందని విమర్శించారు. తన నియోజకవర్గంలో ప్రభుత్వ కార్యక్రమానికి బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్‌ను ఎందుకు ఆహ్వానించలేదని నిలదీశారు.
2017లో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే డైట్ చార్జీలను రూ.1,500కు పెంచామని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ గుర్తుచేశారు. పిల్లలకు సన్నబియ్యం, మటన్, చికెన్, కోడిగుడ్లతో నాణ్యమైన భోజనం అందించామని తెలిపారు. బీఆర్ఎస్ హయాంలో ఉన్న మెనూకు కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ప్రకటించిన మెనూకు ఏమీ తేడా లేదని స్పష్టంచేశారు. 2023లో డైట్ చార్జీలు మళ్లీ పెంచడానికి సబ్ కమిటీ వేశామని తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కార్యక్రమాలను కాపీ పేస్ట్ చేస్తున్నదని పేర్కొన్నారు. కేటీఆర్ గురుకుల బాటకు పిలుపునివ్వడం వల్లే మంత్రులు హాస్టళ్ల బాట పట్టారని తెలిపారు. నిన్న చిలుకూరులో రేవంత్ ముందు విద్యార్థులు కనబరిచిన ప్రతిభాపాటవాలు కేసీఆర్ హయాంలో తీసుకున్న చర్యల ఫలితమేనని చెప్పారు.
రాష్ట్రంలో ఒకవైపు విద్యార్థులు చనిపోతుంటే, దున్నపోతుపై వానపడిన చందంగా ప్రభుత్వం తీరు ఉన్నదని మాజీ ఎమ్మెల్యే బాల సుమన్ విమర్శించారు. అసెంబ్లీ సమావేశాల్లో గురుకుల సమస్యలపై బీఆర్ఎస్ నిలదీస్తుందనే భయంతో మంత్రులు తూతూమంత్రంగా గురుకులాలకు వెళ్లారని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డికి బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల పట్ల చిత్తశుద్ధి లేదని తెలిపారు. గురుకుల బాటతో కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచామని బీఆర్ఎస్ నేత డాక్టర్ ఎర్రోళ్ల శ్రీనివాస్ చెప్పారు. కేటీఆర్ సూచించిన విధంగా గురుకుల బాట చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం దిగివచ్చిందని తెలిపారు.