హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ దోపిడీ చేసిందన్న ప్రధాని మోదీ.. మరి తమ పార్టీ ఎంపీలనే ఎలా బీజేపీలోకి చేర్చుకున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో అభివృద్ధి జరగకపోతే ఎందుకు కండువా కప్పారని నిలదీశారు. దోపిడీదారులు అని ఆరోపించిన తమరే.. వాళ్లను పక్కన పెట్టుకొని మల్కాజిగిరి, నాగర్‌కర్నూల్ సభల్లో ఓట్లు ఎలా అడిగారని కడిగేశారు. ఆదివారం తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ను బలహీనపర్చాలని కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ‘పార్లమెంట్లో చంద్రబాబు గురించి మాట్లాడాల్సి వస్తే, తెలంగాణలో కేసీఆర్ బ్రహ్మండంగా పనిచేస్తున్నారని కొనియాడారు. మిషన్ భగీరథ ప్రారంభోత్సవంలో మోదీ ప్రశంసలు కురిపించలేదా? ఇదేం దొంగనీతో బీజేపీనే చెప్పాలి. కిషన్‌రెడ్డి మాట్లాడుతూ దొంగపాలన పోతుందనుకుంటే, గజదొంగల పాలన వచ్చిందని అన్నారు. మరి బీఆర్ఎస్ దొంగల పార్టీ అయితే, మా నేతల ఇంటి ముందు కిషన్‌రెడ్డి నైట్‌వాచ్‌మన్ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు? బీఆర్ఎస్ నుంచి వచ్చిన వారికి బీజేపీ ఎంపీ టికెట్లు ఇస్తున్నారు? దొంగలకే బీజేపీ టికెట్లు ఇస్తున్నదా?’ అని నిలదీశారు. ఆదిలాబాద్‌లో నగేశ్, జహీరాబాద్‌లో బీబీపాటిల్, మహబూబ్‌నగర్‌లో రాములు కుమారుడికి, నల్లగొండలో సైదిరెడ్డి.. వీళ్లంతా బీఆర్ఎస్ నుంచి వెళ్లినవారేనని, వారికే టికెట్లు ఇచ్చారని వెల్లడించారు. బీఆర్ఎస్ను ప్రశ్నించే నైతిక అర్హత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డికి లేదని ధ్వజమెత్తారు.
ఇప్పుడే ఆట మొదలైందని, దమ్మేంటో చూపుతామని దళితుల భూములను గుంజుకున్న దొంగ ఈటల రాజేందర్ మాట్లాడటం సిగ్గుచేటు అని రావుల నిప్పులు చెరిగారు. హుజురాబాద్‌లో, గజ్వేల్‌లోనే ఆయన దమ్మేంటో తెలిసిపోయిందని విమర్శించారు. బ్లాక్మెయిల్ రాజకీయాలతో మల్కాజిగిరి ఎంపీ టికెట్ సంపాదించిన ఈటలకు కొద్దిగానైనా ఆత్మగౌరవం ఉన్నదా? అని ప్రశ్నించారు. కుటుంబ రాజకీయాల గురించి బీజేపీ మాట్లాడటం సిగ్గుచేటు అని ఎద్దేవా చేశారు. ఆదివాసీ బిడ్డ బాపూరావు ఆదిలాబాద్‌లో గెలిస్తే కనీస గౌరవం ఇవ్వలేదని, ఈ సారి టికెట్ కూడా ఇవ్వలేదని ధ్వజమెత్తారు. ఎస్సీ వర్గీకరణ పేరిట మాదిగలను మోసం చేస్తున్నారని, పదేండ్లుగా ఏం చేశారని ధ్వజమెత్తారు. దళితుల కోసం దళితబంధు పెట్టిన చరిత్ర బీఆర్ఎస్ది అని, ఏకైక నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. బీజేపీకి నిజంగా దళితులపై ప్రేమ ఉంటే దేశం మొత్తం దళితబంధు అమలు చేస్తామని ఎన్నికల మ్యానిఫెస్టో పెడుతుందా? అని సవాల్ విసిరారు.
అసలు బీజేపీకి తెలంగాణ సమాజం ఎందుకు ఓటేయాలని శ్రీధర్‌రెడ్డి నిలదీశారు. పసుపు బోర్డు అటే పోయిందని, కరీంనగర్లో తట్టెడు మట్టి ఎత్తిపోయలేదని, సికింద్రాబాద్‌లో మూడు లిఫ్ట్‌లు, పవర్బోర్డులు తప్ప కిషన్‌రెడ్డి చేసిందేమీ లేదని విమర్శించారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మొదలు అనేక విభజన హామీలను ఎందుకు అమలు చేయలేదని, ఎందుకు ఓటేయాలో చెప్పి ఓట్లు అడగాలని బీజేపీని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ అంతరించిపోతుందని బీజేపీ నేతలు మాట్లాడటం విడ్డూరంగా ఉన్నదని అన్నారు. బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలు, 20కిపైగా ఎమ్మెల్సీలు, పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు సభ్యులు ఉన్నారని, అయినా పార్టీ అంతరించిపోతుంది అనటం వారి అవివేకానికి నిదర్శనమని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టు తర్వాత పార్టీ పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు బీజేపీ వైఖరిని, మోదీ నిరంకుశత్వాన్ని ఎండగట్టారని వివరించారు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని చెప్పి, ఇప్పుడు ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపుతున్నారని కాంగ్రెస్‌పై రావుల ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరు గ్యారెంటీలు అమలు అయ్యాయా? అనేది రేవంత్ రెడ్డి చెప్పాలని డిమాండ్ చేశారు. 2 లక్షల రుణమాఫీ ఏమైందని, రైతుబంధు ఇప్పటి వరకు పడలేదని విమర్శించారు.వరి పంటకు రూ.500 బోనస్ ఏమైందని, మహిళలకు రూ.2,500 ఇస్తామని మాట తప్పారని, పింఛన్లు పెంచలేదని మండిపడ్డారు. గృహజ్యోతికి ఏడాదికి రూ.5 వేల కోట్లు అవసరమైతే, రూ.2,500 కోట్లు పెట్టారని, దాని అమలు ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించారు. మన ఊరు మన బడికి బిల్లులు చెల్లించకపోవటం సంగతి పక్కన పెడితే కనీసం సమీక్ష కూడా చేయడం లేదని ధ్వజమెత్తారు. కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క పిల్లర్ కుంగిపోతే మొత్తం ప్రాజెక్టును పక్కన పెట్టిందని, రైతుల పంటలు ఎండిపోవడానికి రేవంత్ సరార్ కారణమని నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ సర్కారు వచ్చాక గ్రామాల్లో కరెంటు కోతలు మొదలయ్యాయని, మోటర్లు కాలిపోతున్నాయని వెల్లడించారు. రేవంత్‌రెడ్డి, బీజేపీ ఫెవికాల్ బంధం ప్రజలకు అర్థమైందని.. ఆ పార్టీలకు ప్రజలు లోక్‌సభ ఎన్నికల్లో బుద్ధి చెప్తారని తెలిపారు. బీజేపీ కుటిల నీతిని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని, కాంగ్రెస్ వైఫల్యాలను వివరించి ఓట్లను అడుగుతామని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.