Sridhar Reddy | హైదరాబాద్ : జై హింద్ యాత్రలో సీఎం రేవంత్ రెడ్డి బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. ఈ మేరకు శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాజకీయాల్లో భారత సైన్యాన్ని భాగస్వామ్యం చేయొద్దన్నారు. కాంగ్రెస్ అధిష్టానం మెప్పుకోసమే రేవంత్ రెడ్డి సైనికులపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. భారత సైన్యానికి సంబంధించిన రహస్య అంశాలను బయటపెట్టాలని అనడం కరెక్ట్ కాదన్నారు. నకిలీ దేశభక్తులతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ఇదే రేవంత్ రెడ్డి సైనికులకు మద్దతుగా ర్యాలీ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు.
అసలు కాశ్మీర్లో కుంపటి పెట్టింది కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. రాహుల్ గాంధీ ప్రధాని అయితే పిఓకే ఇండియాకు వచ్చేదని సీఎం రేవంత్ రెడ్డి అనడం పెద్ద జోక్ అని అన్నారు. రాహుల్ గాంధీ మెప్పుకోసం రేవంత్ రెడ్డి సైనికులపై మాట్లాడారని ఆగ్రహించారు. కాంగ్రెస్ పార్టీ దేశం మీదకు ఎలాంటి నాయకులను వదులుతుందో ప్రజలు గమనించాలి అని.. కాంగ్రెస్, బిజెపిలో సైనికుల త్యాగాలను అవమానించడం సరికాదన్నారు. సైనిక దళాలకు దేశం యావత్ అండగా ఉండాలన్నారు. రేవంత్ రెడ్డి 30 సార్లు ఢిల్లీ వెళ్లిన రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని దుయ్యబట్టారు. భారత ఆర్మీ శక్తి సామర్థ్యాలను రేవంత్ రెడ్డి శంకించారని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ దేశం మీదకు ఎలాంటి నాయకులను వదులుతుందో ప్రజలు గమనించాలన్నారు. తెలంగాణను కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. కాంగ్రెస్ పాలన చూసి కేసీఆర్ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని, బిఆర్ఎస్ తెలంగాణలో బలమైన శక్తి అని ఈ సందర్భంగా రావుల స్పష్టం చేశారు. బిజెపిలో బీఆర్ఎస్ విలీనం కాదన్నారు. విలీనం కావాల్సిన అవసరం బీఆర్ఎస్కు లేదన్నారు. ఇప్పుడు ఎన్నికలు లేవని, ఇలాంటి చర్చలకు తావే లేదని ఆయన పేర్కొన్నారు.