హైదరాబాద్, మే 30 (నమస్తే తెలంగాణ): జైహింద్ యాత్రలో సీఎం రేవంత్‌రెడ్డి బాధ్యతారహితంగా మాట్లాడారని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సైన్యాన్ని రాజకీయాల్లోకి లాగవద్దని హితవు పలికారు. సైనికులకు మద్దతుగా రేవంత్ ర్యాలీ చేశారని, కానీ కశ్మీర్లో కుంపటి పెట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. నకిలీ దేశభక్తులతో జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
రాహుల్‌గాంధీ ప్రధాని అయితే పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) తిరిగి ఇండియాలో కలిసేదని రేవంత్ అనడం పెద్ద జోక్ అని అన్నారు. సైనికుల త్యాగాలను కాంగ్రెస్, బీజేపీ అవమానించడం సరికాదని, సైన్యానికి దేశం మొత్తం అండగా నిలవాలని కోరారు. తెలంగాణను కేసీఆర్ అన్ని రంగాల్లోనూ అభివృద్ధి చేశారన్న శ్రీధర్‌రెడ్డి.. కాంగ్రెస్ పాలన చూసి మళ్లీ కేసీఆరే సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీలో విలీనం కావాల్సిన అవసరం బీఆర్ఎస్కు లేదని తేల్చి చెప్పారు.