హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ): కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణకు, సికింద్రాబాద్ నియోజకవర్గానికి చేసిందేమీ లేదని, ఆయన చెప్తున్న మాటలన్నీ బూటకమని బీఆర్ఎస్ నేత రావుల శ్రీధర్‌రెడ్డి విమర్శించారు. కేంద్రం నుంచి పదేండ్లలో తెలంగాణకు రూ.పది లక్షల కోట్లు, సికింద్రాబాద్ నియోజకవర్గానికి రూ.46 వేల కోట్లు తెచ్చాననడం అబద్ధమని పేర్కొన్నారు. సికింద్రాబాద్‌కు రూ.46 వేలు కోట్లు తెచ్చి ఉంటే, అసెంబ్లీ ఎన్నికల్లో సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో ఒక సీటు కూడా బీజేపీ ఎందుకు గెలవలేదని ప్రశ్నించారు. కిషన్‌రెడ్డి ఎన్ని రిపోర్టులు ఇచ్చినా ఆయన అసలైన రిపోర్టు ప్రజల దగ్గర ఉన్నదని, ఆయనకు ఈ ఎన్నికల్లో ప్రజలు సరైన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు.
కిషన్‌రెడ్డికి ఎన్నికలప్పుడే ప్రజలు గుర్తొస్తారని ఎద్దేవా చేశారు. సికింద్రాబాద్‌లో మళ్లీ కిషన్‌రెడ్డి గెలిచే పరిస్థితి లేదని చెప్పారు. బీజేపీకి జీహెచ్ఎంసీలో ఉనికే లేదని పేర్కొన్నారు. రైల్వేస్టేషన్లో లిఫ్టులు, కుర్కురే ప్యాకెట్లు పంచడం తప్ప కిషన్‌రెడ్డి ఏం సాధించారని ఎద్దేవా చేశారు. రాజ్యాంగపరంగా కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా కిషన్‌రెడ్డి బీజేపీ అకౌంట్లో వేసుకుంటే ఎలా అని ప్రశ్నించారు. ఆసెంబ్లీ ఎన్నికల్లో ముగ్గురు బీజేపీ ఎంపీలు పోటీ చేసి ఓడిపోయారని, కేంద్రం నుంచి నిధులు తెస్తే వారు ఎందుకు ఓడిపోయారని నిలదీశారు. తమిళనాడు ఓట్ల కోసం గోదావరి జలాలను ఇచ్చంపల్లి నుంచి తరలించుకుపోయేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని మండిపడ్డారు.