హైదరాబాద్, సెప్టెంబర్ 2 (నమస్తే తెలంగాణ) : నదులకే నడక నేర్పిన మహానేత కేసీఆర్ అని, మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల దగ్గర నుంచి రివర్స్ పంపింగ్ ద్వారా శ్రీరాంసాగర్‌లో వరద నీటిని నింపిన గ్రేట్ లీడర్ అని బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్‌రెడ్డి కొనియాడారు. కాకతీయులు గొలుసుకట్టు చెరువులు తవ్విస్తే.. కేసీఆర్ గొలుసుకట్టు రిజర్వాయర్లు నిర్మించారని గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులపై అపోహలు, దుష్ప్రచారాలపై నిగ్గు తేల్చేందుకు గత నెల 28, 29, 30 తేదీల్లో రాకేశ్‌రెడ్డి స్టడీ టూర్ నిర్వహించారు. ప్రాజెక్టు ప్రాధాన్యతలు, వినియోగంలోకి వచ్చిన తీరు, కుంగిన రెండు పిల్లర్ల ప్రస్తుత స్థితిగతులపై వీడియోలు, ఆధారాలతో మంగళవారం తెలంగాణ భవన్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. కాళేశ్వరమే లేకుంటే గంధమల్ల రిజర్వాయర్‌కు రేవంత్‌రెడ్డి ఎందుకు శంకుస్థాపన చేశాడని నిలదీశారు. మల్లన్నసాగర్ నుంచి గండిపేట ద్వారా నీటిని తీసుకెళ్లి మూసి ప్రక్షాళన చేస్తామని ఎలా హామీ ఇచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్ తీరు చూస్తే ప్రభుత్వమే ప్రత్యేక నిధులు కేటాయించి, కాళేశ్వరాన్ని బాంబులు పెట్టి కూల్చేలా ఉన్నదని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులంతా కాళేశ్వరాన్ని మేడిగడ్డ నుంచి బస్వాపురం వరకు పూర్తిగా సందర్శించాలని, అప్పుడే వారికి ఈ ప్రాజెక్టు గురించి స్పష్టంగా అర్థమవుతుందని హితవు పలికారు. ప్రపంచంలోనే మొట్ట మొదటి ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం అని కొనియాడారు. ప్రస్తుతం అక్కడ వరద ఉధృతంగా పోతున్నా బరాజ్‌లు తట్టుకొని దృఢంగా ఉన్నాయన్న విషయాన్ని పీపీటీ ద్వారా వివరించారు.
రికార్డు సమయంలో ప్రాజెక్టు పూర్తి..
కాళేశ్వరం ప్రాజెక్టులను రికార్డు సమయంలో పూర్తి చేస్తే అసెంబ్లీ సాక్షిగా సీఎం, మంత్రులు ఏం తొందర వచ్చిందని అం త తక్కువ టైంలో కట్టారని మాట్లాడటం సిగ్గుచేటని రాకేశ్‌రెడ్డి మండిపడ్డారు. ‘60 ఏండ్లలో కాంగ్రెస్ చేయలేనిది, ఆరేండ్లలో కేసీఆర్ చేసినందుకా? కాంగ్రె స్ పాలకులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నరు?’ అని దుయ్యబట్టారు. కాళేశ్వరం నీళ్లు తెలంగాణకు రాకుండా పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కు పోతున్నాయా? అని నిలదీశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నేతలు బొమ్మర రామ్మూర్తి, కురవ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.