హైదరాబాద్, అక్టోబర్ 15 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో విచ్చలవిడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ, మానవతా విలువలు మరిచి మహిళలు, పిల్లలపై అక్రమంగా ఎఫ్ఐఆర్లు నమోదు చేస్తూ కాంగ్రెస్ సర్కార్ పైశాచిక ఆనందం పొందుతున్నది. మరోవైపు మహిళలపై కాంగ్రెస్ మంత్రులు దుశ్శాసనుడి కంటే ఘోరంగా మాట్లాడుతున్నారు’ అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో బుధవారం బీఆర్ఎస్ మహిళా నేతలు సునీత, కీర్తిలత, పావనిగౌడ్, బీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలుతో కలిసి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మీడియాతో మాట్లాడారు.
మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మాగంటి గోపీనాథ్ ప్రజలకు ఎంతోసేవ చేశారని, ఆయన ఆకస్మిక మరణంతో ప్రజలు బాధకు గురయ్యారని, ప్రచారంలో ఆయన సతీమణి, బీఆర్ఎస్ అభ్యర్థి సునీతాగోపీనాథ్ భావోద్వేగానికి గురై కన్నీళ్లు పెట్టుకుంటే.. సీరియల్ డ్రామాలంటూ మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. తక్షణమే తెలంగాణ మహిళాలోకానికి మంత్రి పొన్నం ప్రభాకర్ బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ, వైఎస్సార్ చనిపోయినప్పుడు ప్రజలు కన్నీళ్లు పెట్టుకున్న ఘటనలు కూడా డ్రామాయేనా అన్న విషయంపై పొన్నం ప్రభాకర్ స్పష్టం చేయాలని ప్రశ్నించారు.
సునీతాగోపీనాథ్, తన కూతురు అక్షర ఇతర కార్యకర్తలతో కలిసి ఈ నెల 10న మధ్యాహ్న ఒంటిగంటకు ఓ ప్రార్థనా మందిరం ముందు లోపలికి కూడా వెళ్లకుండా, రోడ్డుపైనే బాకీ కార్డులను పంచితే నేరం ఎలా అవుతుంది? అని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ప్రశ్నించారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ప్రకారం ముందస్తు నోటీసులు ఎందుకు ఇవ్వలేదు? అని నిలదీశారు. సునీతాగోపీనాథ్, అక్షరతోపాటు మరో ఐదుగురిపై కేసు నమోదు చేసి.. ఇతరులు అని కూడా రాశారని, ఇతరుల పేరుతో మరికొందరిని జైలుకు పంపించాలనే కుట్ర దాగి ఉన్నదని మండిపడ్డారు.
సీఎం రేవంత్‌రెడ్డి దిశానిర్దేశంలో పోలీసులు పక్షపాత వైఖరితో వ్యవహరిస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. రోడ్డుపైన బాకీ కార్డులు పంచిన సునీతా గోపీనాథ్‌పై కేసులు పెట్టిన పోలీసులు.. నవీన్‌యాదవ్ ఫేక్ ఓటరు గుర్తింపు కార్డులు పంచిన విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు. నమస్తే తెలంగాణ దినపత్రికలో వార్త వచ్చేదాకా ఎవరూ పట్టించుకోలేదని, ఆ తర్వాత ఎన్నికల అధికారి కేసు పెడితే.. 48 గంటల తర్వాత కేసు నమోదైందని చెప్పారు. సునీతాగోపీనాథ్ కేసులో మొత్తం ఏడుగురుపై కేసుపెడితే.. నవీన్‌యాదవ్ విషయంలో ఆయన ఒకరిపైనే కేసు పెట్టారని చెప్పారు. సునీతాగోనాథ్కుకు ఒక న్యాయం, నవీన్‌యాదవ్‌కు మరో న్యాయమా? అని నిలదీశారు. జూబ్లీహిల్స్ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ తమ్ముడు ప్రవీణ్యాదవ్కు మూడు ఓట్లు ఉంటే, తెలంగాణ ఎన్నికల కమిషన్ ఎందుకు కేసు నమోదు చేయడం లేదు? అని నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీ, ఎన్నికల కమిషన్ కుమ్మకై బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని తెలిపారు.
సీఎం చేతులమీదుగా జరిగే గ్రూప్-2 నియామక పత్రాల పంపిణీ కార్యక్రమాన్ని నిలిపేయాలని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ డిమాండ్ చేశారు. హైదరాబాద్‌లో నియామకపత్రాలు పంచి, జూబ్లీహిల్స్ ఓటర్లను ప్రభావితం చేయాలని సీఎం రేవంత్‌రెడ్డి చూస్తున్నారని విమర్శించారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఈ నెల 18న హైదరాబాద్‌లోని శిల్పకళావేదికలో గ్రూప్-2 విజేతలకు నియామక పత్రాలు ఇవ్వాలని నిర్ణయించినట్టు వార్తలు వచ్చాయని, ఇది కచ్చితంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గ ఓటర్లను ప్రభావితం చేస్తుందని చెప్పారు. ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, సీఎం ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనడం చట్టవిరుద్ధమైన చర్యగా పరిగణించాలని ఎన్నికల కమిషన్‌ను కోరారు.