Ponnala Lakshmaiah | రైతన్నలతోనే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ఖాయమని మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అధికారం కోసం ఇష్ఠారీతిన హామీలు ఇచ్చి, ఇప్పుడు వాటన్నంటికి కొర్రిలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు ఇచ్చిన హామీల్లో పంట బోనస్‌తో కాంగ్రెస్ పార్టీ మోసాలు పరాకాష్ఠకు చేరాయని మండిపడ్డారు.
హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్లో మంగళవారం పొన్నాల లక్ష్మయ్య మీడియాతో మాట్లాడాడరు. బోనస్ విషయంలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో చెప్పిందేంటి? అమలు చేస్తున్నదేంటి? అని ప్రశ్నించారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీల అమలు ఏమైందని నిలదీశారు. సన్న వడ్లకు మాత్రమే రూ.500బోనస్ ఇస్తామని ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అంటున్నదని అన్నారు. ఎన్నికల ముందు ఇదే మాట చెప్పి ఉంటే.. కాంగ్రెస్ పార్టీకి రైతులు గుణపాఠం చెప్పేవారని తెలిపారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వమని పొన్నాల విమర్శించారు. తడిసిన ధాన్యం వద్దకు ఇప్పటివరకు కాంగ్రెస్ మంత్రులు వెళ్లలేదని అన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ప్రచారానికి ఇతర రాష్ట్రాలకు మంత్రులు వెళ్లడానికి సమయం ఉంటుంది కానీ.. రైతుల వద్దకు వెళ్లడానికి సమయం ఉండట్లేదని విమర్శించారు. అతి తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని అన్నారు. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రజలు, రైతులే బుద్ధి చెబుతారని పేర్కొన్నారు.