హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): రైతులతోనే కాంగ్రెస్ ప్రభుత్వ పతనం ఖాయమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య స్పష్టం చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో మంగళవారం ఆయన మాట్లాడారు. అధికారం కోసం అడ్డగోలు హామీలు ఇచ్చి, ఇప్పుడు వాటన్నంటికీ కొర్రీలు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సన్న వడ్లకే బోనస్ ఇస్తామని ఎన్నికల ముందు చెప్పి ఉంటే అప్పుడు రైతులు కాంగ్రెస్కు గుణపాఠం చెప్పేవారని తెలిపారు. ఓట్లు దండుకోవడం కోసమే సీఎం రేవంత్ లోక్సభ ఎన్నికల్లోనూ బోనస్ మాట చెప్పారని తీరా అమలుకు వచ్చేసరికి సన్న వడ్లకే అని షరతులు పెట్టి రైతులను మోసం చేస్తున్నారని విమర్శించారు.
తడిసిన ధాన్యం కుప్పల వద్దకు మంత్రులు వెళ్లనేలేదని, ఎన్నికల ప్రచారానికి ఇతర రాష్ట్రాలకు వెళ్లడానికి సమయముంది కానీ రైతుల వద్దకు వెళ్లడానికి లేదా అని ప్రశ్నించారు. తడిసిన వడ్లను ఇప్పటివరకు ఒక కిలో కూడా ప్రభుత్వం కొనుగోలు చేయలేదని, అవి కాస్తా మొలకెత్తాయని వాటి సంగతేంటి అని పేర్కొన్నారు. రైతుబంధు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇస్తామన్న అంశంపై మంత్రిమండలి సమావేశంలో చర్చ జరిగిందా అని ప్రశ్నించారు. తమ అవసరాల కోసమే క్యాబినెట్ మీటింగ్ పెట్టుకున్నారని ధ్వజమెత్తారు. అతి తకువ సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందని, రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి ప్రజలు, రైతులు బుద్ధి చెప్తారని తెలిపారు. రైతుబంధు ఎప్పుడు ఇవ్వాలో ప్రభుత్వానికి తెలియడమే లేదని ఎద్దేవా చేశారు.