Peddi Sudarshan Reddy | స్థానిక సంస్థల ఎన్నికలు తప్పనిసరి అయిన పరిస్థితుల్లో ఓట్ల కోసం రైతు భరోసా పేరిట నాటకానికి తెరతీశారని మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి బజారు రౌడీ కన్నా హీనంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రైతు భరోసా స్థానిక సంస్థల స్టంట్ మాత్రమేనని అన్నారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో పెద్ది సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో రైతుబంధు ఎలా వచ్చేదో.. ఇప్పుడు ఎలా వస్తుందో.. రైతులు ఆలోచించుకోవాలని సూచించారు.
ప్రజలను అన్ని రకాలుగా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతుందని పెద్ది సుదర్శన్ రెడ్డి విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చే కాంగ్రెస్ నేతలను అడుగడుగునా నిలదీయాలని కోరారు. ఎకరాకు రూ.25 వేల బకాయిలు ఇచ్చే వరకు స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి కాంగ్రెస్ నేతలను రానివ్వద్దని సూచించారు. కేసీఆర్ నాట్లకు, నాట్లకు మధ్య రైతుబంధు ఇచ్చే వారని.. రేవంత్ రెడ్డి ఓట్లకు ఓట్లకు మధ్య రైతు భరోసా ఇస్తున్నారని విమర్శించారు. సర్పంచుల పాత బిల్లులకు తమకు సంబంధం లేదని సీఎం రేవంత్ రెడ్డి విడ్డూరంగా మాట్లాడారని అన్నారు. అలా అయితే కేసీఆర్ ప్రాణాన్ని పణంగా పెట్టి తీసుకొచ్చిన తెలంగాణతో, ఆయన కట్టిన సచివాలయంతో రేవంత్ రెడ్డికి ఏం సంబంధం అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి తెలంగాణ పాలకుడు కాదని అన్నారు.
ధాన్యం కొనుగోళ్ల విషయంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పేది శుద్ధ తప్పు అని పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నారు. పంటల కొనుగోళ్లు విషయంలో రైతులు ఈసారి పడిన ఇబ్బందులు ఎప్పుడూ లేదని తెలిపారు. పంటల కొనుగోళ్ల పేరిట కాంగ్రెస్ కార్యకర్తలు రైతుల నుంచి దోపిడీకి పాల్పడ్డారని విమర్శించారు. కొనుగోలు కేంద్రాల నిర్వహణ పేరిట రూ.1500 కోట్ల దోపిడీకి కాంగ్రెస్ పాల్పడిందని ఆరోపించారు. అణువణువునా కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేస్తోందని విమర్శించారు. ఈ పంట కాలంలో రైతులకు ఒక్క క్వింటాలుకు కూడా బోనస్ ఇవ్వకుండా బోగస్ చేశారని అన్నారు. ధ్యానం టెండర్ల కుంభకోణంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కడుపు నిండా తినడంతో పాటు దిల్లీకి కూడా పంపారని అన్నారు. హైకోర్టులో పిల్ దాఖలు చేస్తే… ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా తప్పించుకుంటోందని మండిపడ్డారు. తప్పు చేయకపోతే ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయకుండా 16 వాయిదాలు ఎందుకు తీసుకొందని ప్రశ్నించారు. రైతుల ఉసురు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి తగలక తప్పదని అన్నారు.