హైదరాబాద్, జూలై 1 (నమస్తే తెలంగాణ) : పీసీసీ అంటే పెద్ద క్రెడిట్ చోర్ అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ కొత్త నిర్వచనాన్నిచ్చారు. లోక్‌సభలో రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యేందుకు రేవంత్‌రెడ్డే చక్రం తిప్పారని ఆయన అనుచరులు చేస్తున్న ప్రచారాన్ని చూస్తే ఆశ్చర్యం వేసిందని, హాస్యాస్పదంగా ఉన్నదని ఎద్దేవాచేశారు. సోమవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో క్రిశాంక్ మాట్లాడుతూ తెలంగాణకు ఫాక్స్‌కాన్ సంస్థను ఎంతో కృషి చేసి కేటీఆర్ తీసుకువచ్చి భూమిపూజ చేస్తే తామే తెచ్చామని, రేవంత్‌రెడ్డి మనుషులు ప్రచారం చేయడం మొదలు పెట్టారని చెప్పారు. సీతారామ ప్రాజెక్టును మొత్తం పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని స్పష్టం చేశారు. భూసేకరణ చేసింది, అధికారులు, నిపుణులు, ఇంజినీర్లతో మాట్లడింది కేసీఆర్ అని గుర్తుచేశారు. దేశ వ్యాప్తంగా స్మార్ట్‌సిటీ పనుల గడువు పొడగిస్తే, రేవంత్‌రెడ్డే పొడగించేలా చేశారని కాంగ్రెస్ నాయకులు అనడం విడ్డూరంగా ఉందని చెప్పారు.
జీహెచ్ఎంసీలో కంటోన్మెంట్ విలీనాన్ని కాంగ్రెస్ తన ఖాతా లో వేసుకున్నదని, మోదీని తామే ఒప్పించామని ప్రచారం చేసుకుంటున్నదని, దేశవ్యాప్తంగా అన్ని కంటోన్మెంట్ బోర్డులను ఆయా రాష్ర్టాల ప్రభుత్వాల్లో విలీనం చేయాలని కేంద్రమే నిర్ణయం తీసుకున్నదని తెలిపారు. 2023 మేలోనే బోర్డును రాష్ట్ర ప్రభుత్వం ఒప్పుకున్నట్టుగా కేసీఆర్ లేఖ రాశారని, కేటీఆర్ అనేకసార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర రక్షణ శాఖ మం త్రులను కలిసి కంటోన్మెంట్‌ను ప్రభుత్వంలో విలీ నం చేయాలని కోరారని గుర్తుచేశారు. బోర్డు భూ ముల విషయంలో మీటింగ్‌కు మలాజిగిరి ఎంపీ గా అప్పుడు రేవంత్‌రెడ్డి హాజరేకాలేదని తెలిపారు.
గూండాలు, బౌన్సర్లతో పరామర్శలా?
నిరుద్యోగులు తిరగబడుతున్నారని భయపడి గూండాలు, బౌన్సర్లను పెట్టుకొని గాంధీ దవాఖానలో మోతీలాల్‌ను పరామర్శించేందుకు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు వెళ్తున్నారని క్రిశాంక్ విమర్శించారు. ‘రేవంత్‌రెడ్డీ.. నీకు పాలన అంటే పట్టదా? పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు, జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ హామీలు ఏమయ్యాయి’ అని ప్రశ్నించారు. మోతీలాల్‌కు ఏదైనా జరిగితే కాంగ్రెస్, రేవంత్‌రెడ్డి ప్రభుత్వానిదే బాధ్యత అంటూ హెచ్చరించారు. ఆయన ప్రాణం కాపాడాలని కోరా రు. గ్రూప్- 1 మెయిన్స్‌కు 1:100 అవకాశం కల్పిస్తామని గతంలోనే కాంగ్రెస్ హామీ ఇచ్చిందని తెలిపారు. క్రెడిట్ కోసం రేవంత్‌రెడ్డి ఆరాటపడుతున్నారని విమర్శించారు.