హైదరాబాద్, ఫిబవరి 26 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో బీజేపీ నేతలు ఏ ముఖం పెట్టుకొని ఓట్లు అడుగుతారని బీఆర్ఎస్ నేత మన్నె క్రిషాంక్ ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీకి ఓటు అడిగే నైతిక అర్హత, హక్కు లేదని అన్నారు. వివిధ రాష్ర్టాలకు గత నెల రోజుల్లో వేల కోట్ల నిధులు కేటాయిస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం.. తెలంగాణకు ఒక్క పైసా కూడా ఎందుకు ఇవ్వడంలేదని ప్రశ్నించారు. దీనిపై బీజేపీ నేతలు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. తెలంగాణభవన్‌లో సోమవారం క్రిషాంక్ మీడియాతో మాట్లాడుతూ ఎలక్షన్ టు కలెక్షన్ అన్నది బీజేపీ విధానంగా మారిందని విమర్శించారు. విభజన చట్టంలో పేర్కొన్న అంశాలను కేంద్రంఎందుకు అమలు చేయడంలేదని, ఈ విషయాన్ని కాంగ్రెస్ అడగటంలేదని ధ్వజమెత్తారు. పసుపు బోర్డు ప్రకటించినా దానిని ఎక్కడ ఏర్పాటు చేస్తారో ఇంత వరకు చెప్పడంలేదని అన్నారు. పార్లమెంటు ఎన్నికల కోసమే బీజేపీ రాజకీయాలు చేస్తున్నదని విమర్శించారు. దేశంలోని అన్ని రామాలయాలు తిరిగిన మోదీకి భద్రాచలం రాముడు ఎందుకు గుర్తురాలేదని ప్రశ్నించారు. తెలంగాణ పట్ల మోదీకి చిన్నచూపు ఎందుకని మండిపడ్డారు. రెండు రోజుల వ్యవధిలోనే గుజరాత్లో లక్ష కోట్లతో మోదీ పలు పథకాలను ప్రారంభించారని గుర్తుచేశారు. మరి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, ధర్మపురి అరవింద్ తెలంగాణ ప్రజల ఓట్లు ఎట్లా అడుగుతారని నిలదీశారు. బీజేపీ బడా జూటా పార్టీ అని, తెలంగాణకు ఆ పార్టీ చేసిన మోసాన్ని ప్రజల్లోకి ఎజెండాగా తీసుకెళ్తామని చెప్పారు. కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి రాదని స్వయంగా రేవంత్‌రెడ్డి చెప్తున్నారని, అందుకే కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బీజేపీని నిలదీస్తామని అంటున్నారని విమర్శించారు. తెలంగాణ కోసం కొట్లాడే బీఆర్ఎస్కే పార్లమెంట్ ఎన్నికల్లో అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.