కంటోన్మెంట్/మూసాపేట, హైదరాబాద్, ఏప్రిల్ 23 (నమస్తే తెలంగాణ): ప్రతిపక్ష నేతలను నేరుగా ఎదుర్కోలేని అధికార కాంగ్రెస్ పార్టీ వారి కుటుంబసభ్యులను బజారుకీడిస్తూ పబ్బం గడుపుకుంటున్నదని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి, సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ ఆగ్రహం వ్యక్తంచేశారు. క్రిశాంక్ భార్యపై సోషల్ మీడియాలో చేసిన అసత్య ప్రచారం తీవ్ర విమర్శలకు దారితీసింది. తప్పుడు ప్రచారం చేసిన సదరు కాంగ్రెస్ నాయకుడికి స్థానికులు దేహశుద్ధి చేసినట్టు తెలిసింది.
దీనిపై మన్నె క్రిశాంక్ స్పందిస్తూ.. రాజకీయంగా తనను ఎదురోలేక కాంగ్రెస్ నాయకులు తన కుటుంబసభ్యులను లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో నీచమైన ప్రచారాలకు ఒడిగడుతున్నారని మండిపడ్డారు. ‘రాజకీయాల్లో ఉన్నది నేను.. నాతో యుద్ధం చేయండి. నా భార్య ఏం పాపం చేసింది? రాజకీయ కక్షతో ఒక మహిళను బలిచేస్తారా?’ అంటూ అధికార పార్టీ నేతలను నిలదీశారు. మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మైనింగ్ అక్రమాలను, మంత్రి సీతక శాఖలోని అంగన్వాడీ ఫోన్ సామ్‌ను తాను ఆధారాలతోసహా బయటపెట్టినందుకే ప్రభుత్వం ఈ రకమైన కక్షసాధింపు చర్యలకు దిగుతున్నదని ఆరోపించారు.
జూపల్లి కృష్ణారావుకు చెందిన సోం డిస్టిలరీ కాంట్రాక్టుపై ఆధారాలతో ప్రశ్నించామని, రేవంత్‌రెడ్డి అల్లుడి ఫార్మాపై, మెడికవర్ షేర్స్‌పై ఆధారాలతో బయటపెట్టామని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజాస్వామికంగా ప్రశ్నిస్తున్నామని, వాటికి సమాధానాలు చెప్పకుండా గాంధీభవన్ కేంద్రంగా వ్యక్తిగతంగా ద్రుష్పచారం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నాయకులు చేస్తున్న చిల్లర రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ నేతలను ఎదురోవడంలో విఫలమైన కాంగ్రెస్, వ్యక్తిగత దూషణలకు దిగుతూ కుటుంబగౌరవానికి భంగం కలిగిస్తున్నదని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం గాంధీభవన్ వేదికగా సోషల్ మీడియా ద్వారా తన భార్యపై తప్పుడు వార్తలు, అసత్య ప్రచారాలు చేస్తున్నారని క్రిషాంక్ ఆరోపించారు. ఆంధ్రప్రభ పత్రిక పేరుతో మార్ఫింగ్ చేసిన వార్తలను సృష్టించి వైరల్ చేస్తున్న తీరుపై మండిపడ్డారు. ఈ అసత్య ప్రచారాలపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ ఆయన కూకట్పల్లి ఏసీపీకి ఫిర్యాదు చేశారు. అంతకుముందు తన భార్యకు వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టు చేసిన కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కన్వీనర్ రాజేందర్‌ను అతడి ఇంటివద్ద క్రిషాంక్తో సహా పలువురు బీఆర్ఎస్ నాయకులు నిలదీశారు. క్రిషాంక్‌కు స్థానిక మహిళలు సైతం మద్దతు పలకడం విశేషం.
కాంగ్రెస్ పార్టీ కూకట్పల్లి సోషల్ మీడియా కో అర్డినేటర్ గుండమల్ల రాజేందర్ తనను, తన కుటుంబాన్ని కించపరుస్తూ సోషల్ మీడియాలో తప్పుడు పోస్టులు పెట్టారని ఏసీపీకి చేసిన ఫిర్యాదులో పేర్కొన్నారు. రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజమని, కానీ పచ్చని సంసారాల్లో చిచ్చు పెట్టేలా, మహిళలను కించపరిచేలా వ్యవహరించడం కాంగ్రెస్ దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని క్రిశాంక్ విమర్శించారు. రాజకీయ పోరాటంలో నైతికతను విస్మరించి, కుటుంబాలను రోడ్డుపైకి లాగడం ప్రజాస్వామ్యానికి చేటని వ్యాఖ్యానించారు. తనపై జరుగుతున్న ఈ సోషల్ మీడియా దాడి వెనుక ఉన్న సూత్రధారులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు.