Manne Krishank | హైదరాబాద్ : పీసీసీ అంటే పెద్ద క్రెడిట్ చోర్ అంటూ కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ మన్నె క్రిశాంక్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. రేవంత్ రెడ్డి క్రెడిట్ కోసం ఆరాట పడుతున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ భవన్లో మన్నె క్రిశాంక్ మీడియాతో మాట్లాడారు.
రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నిక కావడానికి కారణం రేవంత్ రెడ్డి అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఫాక్స్‌కాన్ సంస్థను తెలంగాణకు తీసుకువచ్చింది కేటీఆర్.. దీన్ని కాంగ్రెస్ ఘనతగా గొప్పలు చేసుకుంటున్నారు. సీతారామ ప్రాజెక్టును మొత్తం పూర్తి చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం. కంటోన్మెంట్‌ను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని కాంగ్రెస్ తన ఖాతాలో వేసుకుంది. దేశవ్యాప్తంగా అన్ని కంటోన్మెంట్ బోర్డులను రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో కేటీఆర్ అనేక సార్లు ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలిసి కంటోన్మెంట్ బోర్డును రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని కోరారు. కంటోన్మెంట్ భూముల విషయంలో స్పెషల్ మీటింగ్‌కు మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా రేవంత్ రెడ్డి హాజరు కాలేదు అని క్రిశాంక్ గుర్తు చేశారు.
రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్షుడుగా ప్రజలకు అనేక హామీలు ఇచ్చారు. రాహుల్ గాంధీ అశోక్ నగర్ వద్దకు వచ్చి మొదటి సంవత్సరంలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు. కాంగ్రెస్ జాబ్ క్యాలెండర్ ఏమైంది..? కాంగ్రెస్ మెగా డీఎస్సీ ఏమైంది..? మోతీలాల్ నాయక్‌కు ఏమైనా జరిగితే బాధ్యత కాంగ్రెస్ ప్రభుత్వానిదే. గ్రూప్-1 మెయిన్స్‌కు 1:100 అవకాశం కల్పిస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది. కాంగ్రెస్ గ్యారెంటీలు వెనక్కి వెళ్లి స్కాంలు ముందుకు వచ్చాయని మన్నె క్రిశాంక్ పేర్కొన్నారు.