హైదరాబాద్, జనవరి 20 (నమస్తే తెలంగాణ): మూడేండ్ల క్రితం స్థాపించిన గోడి ఇండియా కంపెనీకి ఇప్పటివరకూ మూలధనమే మిగలలేదని, అలాంటి కంపెనీ రూ.8 వేల కోట్ల పెట్టుబడి ఎలా పెడుతుందని బీఆర్ఎస్ నేత క్రిశాంక్ ప్రశ్నించారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు మండలానికి చెందిన మహేశ్ గోడి అనే వ్యక్తి 2020లో గోడి ఇండియా కంపెనీని ప్రారంభించారని, మహేశ్వరం మండలంలో ఈ కంపెనీ పెట్టారని చెప్పారు. కావలి సిద్ద లింగప్ప, శోభారాణి కూడా ఇందులో డైరెక్టర్లని తెలిపారు. వీరి మొత్తం క్యాపిటల్ రూ.1.70 కోట్లు అని, ఇందులో 31 శాతం షేర్లను గ్రాఫైట్ ఇండియాకు రూ.50 కోట్లకు విక్రయించారని, ఐసీఐసీఐ బ్యాంకు నుంచి కంపెనీ కోటి రూపాయల రుణం తీసుకున్నదని వివరించారు.
ముంబైకి చెందిన మరో సంస్థ నుంచి రూ.5.50 కోట్ల రుణం తీసుకున్నారని, మొత్తంగా కంపెనీకి వార్షిక నష్టం రూ.27.73 లక్షలని ఆయన స్పష్టం చేశారు. మూడేండ్లుగా ఎలాంటి కార్యకలాపాలు కూడా నిర్వహించలేదని తెలిపారు. ఈ లెక్కలను ఆ కంపెనీనే ప్రకటించిందని వెల్లడించారు. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనలో ప్రచార ఆర్భాటం తప్ప వాస్తవ పెట్టుబడులు లేవని అన్నారు. పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం చేసుకున్న కంపెనీలు, వాస్తవాలను క్రిశాంక్ శనివారం తెలంగాణ భవన్లో మీడియాకు వెల్లడించారు. దావోస్‌లో రాష్ర్టానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులు తెచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్నదని, ఇందులో ఏ మాత్రం వాస్తవం లేదని చెప్పారు. దావోస్‌కు తెలంగాణ ప్రజాధనంతో వెళ్లారనే విషయాన్ని రేవంత్‌రెడ్డి గుర్తించాలని, దావోస్‌లో కూడా ‘మా కాంగ్రెస్’ అంటూ సీఎం మాట్లాడటాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నదని అన్నారు.
రాహుల్‌గాంధీ ప్రతిరోజూ అదానీ గురించి, ఆయన అవినీతి గురించి మాట్లాడుతుంటారని, అవినీతికి చిహ్నం అదానీ అని రాహుల్ విమర్శించారని గుర్తుచేశారు. అవినీతికి చిహ్నమైన అదానీ తన అవినీతి సొమ్ము రూ.12,400 కోట్లు తెలంగాణలో పెట్టుబడి పెడుతున్నారా? అనేది సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలని క్రిశాంక్ డిమాండ్ చేశారు. 2017లో కేసీఆర్ అదానీ పెట్టుబడులను తిరస్కరించారని, సింగరేణి, విద్యుత్తు ప్రాజెక్టులను కొనుగోలు చేయాలనే ప్రయత్నాలను నిలువరించారని గుర్తు చేశారు. అదానీకి ఒక్క పైసా సబ్సిడీ కూడా ఇవ్వలేదని తెలిపారు. రేవంత్‌రెడ్డి సీఎం కాగానే, ప్రధానిని కలవగానే అదానీ వచ్చి ఇక్కడ పెట్టుబడులు పెడుతున్నారని, కాంగ్రెస్ పార్టీ బీజేపీకి బీ టీమ్‌గా తయారయ్యిందని దుయ్యబట్టారు. దీనిపై రాహుల్‌గాంధీ తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
దావోస్‌లో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టాయని చెప్పుకుంటున్న కంపెనీల్లో ప్రధానమైనవి మూడేనని, ఇందులో అదానీ కంపెనీ రూ.12వేల కోట్లు, జేఎస్‌డబ్ల్యూ రూ.9 వేల కోట్లు, గోడి ఇండియా రూ.8 వేల కోట్లు అని క్రిశాంక్ తెలిపారు. జేఎస్‌డబ్ల్యూ సంస్థ 2022లోనే రూ.9వేల కోట్ల పెట్టుబడికి ఒప్పందం చేసుకొన్నదని చెప్పారు. అదానీ కంపెనీవి రూ.12 వేల కోట్లని, ఇక వాస్తవ పెట్టుబడులు ఎక్కడ అని క్రిశాంక్ ప్రశ్నించారు.