హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ): నాడు అధికారం కోసం బీసీ వాదాన్ని ఎత్తుకున్న కాంగ్రెస్, నేడు నమ్మించి మోసం చేసిందని శాసనమండలిలో ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బీసీ రిజర్వేషన్లపై 22 నెలలుగా మసిబూసిమారేడు కాయ చేసి నిండాముంచిందని నిప్పులు చెరిగారు. ‘బీసీ కోటాకు రాష్ట్రంలో అన్ని పార్టీలు మద్దతు తెలిపితే ఢిల్లీలో ఉన్న రాహుల్‌గాంధీ ఎప్పుడు పట్టించుకోలేదు..ఏనాడు పార్లమెంట్లో ప్రస్తావించలేదు..కానీ బీహార్‌లో బీసీల ఓట్ల కో సం గొప్పలు చెబుతున్నరు..’ అంటూ తూర్పారబట్టారు. గురువారం తెలంగాణ భవన్ లో కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్, పార్టీ నేతలు ఉపేంద్రాచారి, కిశోర్ గౌడ్ తో కలిసి విలేకరులతో మాట్లాడారు. 42 శాతం బీసీ కోటా అంశం కోర్టుల్లో నిలువదని తెలిసినా ఇంతకాలం మభ్యపెట్టిందని ఆరోపించారు. స్థానిక ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి మోసపూరిత డ్రామాలను రక్తికట్టించిందని మండిపడ్డారు. తొమ్మిదో షెడ్యూల్లో చేర్చి తేనే చట్టబద్ధత సాధ్యమని తెలిసినా అడుగడుగునా మభ్యపెట్టిందని దుయ్యబట్టారు. అయినా కాంగ్రెస్ సర్కారును ప్రజలెవరూ నమ్మలేదని, నామినేషన్ల ప్రక్రియ మొదలైనా దాఖలు చేసేందుకు చొరవచూపలేదని గుర్తుచేశారు.
రెడ్డి వర్గీయులు పాలకులని, మిగిలిన వారందరూ పాలితులని మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బీసీలకు రిజర్వేషన్లు అమలు చేస్తామంటే ఎవరూ నమ్మలేదని పేర్కొన్నారు. ఈ విషయంలో ఆయన ఎప్పుడూ చిత్తశుద్ధి కనబరచలేదని మండిపడ్డారు. 56 సార్లు ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులను కలిసినా బీసీ కోటాపై చర్చించలేదని గుర్తుచేశారు. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో లబ్ధిపొందేందుకు బీసీ కోటాను తలకెత్తుకు న్నారని విమర్శించారు. కోర్టులో కేసులు వేయించి ద్రోహం చేశారని మండిపడ్డారు. లాయర్లను పెట్టి హంగామా చేసి చివరకు చేతులేత్తాశారని దుమ్మెత్తిపోశారు. దేశాన్ని అత్యధిక కాలం పాలించిన కాంగ్రెస్ బీసీలను ఆదినుంచి మోసం చేస్తూనే ఉన్నదని దుయ్యబట్టారు. బీసీ సమాజం వాస్తవాలను గ్రహించి సంఘటితమై కాంగ్రెస్ కుట్రలను తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్లి తగిన బుద్ధిచెప్పాల్సిన సమయం ఆసన్నమైందని స్పష్టం చేశారు.
బీసీ రిజర్వేషన్లపై బీఆర్ఎస్ మొదటి నుంచి నిబద్ధతతో ఉన్నదని స్పష్టం చేశారు. అసెంబ్లీలో అధికారం పక్షం తెచ్చిన బీసీ బిల్లులకు బేషరతుగా మద్దతిచ్చిందని గుర్తుచేశారు. చట్టబద్ధత కోసం విలువైన సూచనలు చేసిందని చెప్పారు. కానీ సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రులు అపహాస్యం చేశారే తప్పితే ఏనాడు పరిగణలోకి తీసుకోలేదని ఆక్షేపించారు. అందుకే ఇప్పుడు బీసీ రిజర్వేషన్లకు ఈ దుస్థితి దాపురించిందని ధ్వజమె త్తారు. ఇప్పటికైనా బీసీ కోటాకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ చిత్తశుద్ధి కనబరచడం లేదని కార్పొరేషన్ మాజీ చైర్మన్ పల్లె రవికుమార్ ఆరోపించారు. కోటాకు రాజ్యాంగరక్షణ కల్పించకుండా నాటకాలాడిందని ధ్వజమెత్తారు. ఇప్పుడు కోర్టులో జీవో 9 కొట్టుడుపోగానే నెపం బీఆర్ఎస్పై నెడుతున్నదని మండిపడ్డారు. అంటే ఇంతకాలం కాంగ్రెస్ డ్రామాలకు వంతపాడాలా? అని ప్రశ్నించారు. రిజర్వేషన్లకు రాజ్యాంగ రక్షణ అవసరమని బీఆర్ఎస్ మొదటి నుంచి చెబుతున్నదని గుర్తుచేశారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించి బలహీనవర్గాలను మోసం చేసిందని దుయ్యబట్టారు.
బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ మొదటి నుంచి మోసమే చేస్తున్నదని బీసీ కమిషన్ మాజీ మెంబర్ ఉపేంద్రాచారి మండిపడ్డారు. అడుగడుగునా తప్పులు చేసి ఇప్పుడు తప్పించుకొనేందుకు యత్నిస్తున్నదని ఆరోపించారు. జీవోతో రిజర్వేషన్లు అమలు సాధ్యం కాదని తెలిసినా డ్రామాలతో నెట్టుకొచ్చిందని ధ్వజమెత్తారు. తప్పులు చేసిన సర్కారుకు హైకోర్టు కడిగిపారేసిందని గుర్తుచేశారు. బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకున్నదని ఆరోపించారు. బీసీలందరూ ఏకమై ద్రోహపూరిత కాంగ్రెస్‌ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు.
కాంగ్రెస్ అసమర్థతతోనే బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే ఇచ్చిందని బీసీ కమిషన్ మాజీ మెంబర్ కిశోర్‌గౌడ్ విమర్శించారు. రేవంత్‌రెడ్డి దుర్మార్గపు పోకడలకు బీసీ సమాజం బలైపోయే పరిస్థితి వచ్చిందని ఆరోపించారు. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ బీసీ కోటాకు చట్టబద్ధత కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. లేదంటే ఉద్యమనేత కేసీఆర్ పోరాట స్ఫూర్తితో ఉద్యమించి కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచుతామని హెచ్చరించారు. తమిళనాడు తరహాలోనే రిజర్వేషన్లకు రక్షణ కల్పించాలని బీఆర్ఎస్ లీగల్‌సెల్ మెంబర్ జక్కుల లక్ష్మణ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే పరిగణించిందని, బీసీ రిజర్వేషన్లపై రేవంత్‌రెడ్డి సర్కారుకు చిత్తశుద్ధి లేదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు. మాయ మాటలు చెప్పి బీసీలను మోసం చేసి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ లబ్ధి పొందాలని చూస్తున్నదని మండిపడ్డారు. లీగల్‌గా చెల్లుబాటు కాదని తెలిసి, ఇది రాజ్యాంగబద్ధంగా లేదని, కోర్టులో చెల్లదని తెలిసి కూడా డ్రామా ఆడిందని గురువారం ఒక ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. మహారాష్ట్రలోని స్థానిక సంస్థల ఎన్నికలు రిజర్వేషన్ల కారణంగా హైకోర్టు తీర్పు రద్దు అయిన విషయం తెలిసినా అదే మార్గంలో నడిచిందని విమర్శించారు. బీసీ ప్రజలను మభ్యపెట్టేందుకు డ్రామాలు ఆడిందని మండిపడ్డారు.