Kyama Mallesh | హైదరాబాద్ : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి బీసీలకు అరచేతిలో బెల్లం పెట్టి మోచేతితో నాకిస్తున్నారని బీఆర్ఎస్ నేత క్యామ మల్లేష్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కొందరు బీసీ నేతలు రేవంత్ రెడ్డి చేతిలో బాడుగ నేతలుగా మారారని మండిపడ్డారు. తెలంగాణ భవన్లో క్యామ మల్లేష్ మీడియాతో మాట్లాడారు.
కామారెడ్డి బీసీ డిక్లరేషన్లో కాంగ్రెస్ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చింది. 42 శాతం రిజర్వేషన్లపై సాంకేతిక అంశాలను రేవంత్ రెడ్డి కావాలనే విస్మరించి బీసీల పట్ల దుర్మార్గంగా వ్యవహరించారు. కాంగ్రెస్, బీజేపీలను తప్పుబట్టాల్సిన కొందరు బీసీ నేతలు బీఆర్ఎస్ను తప్పుబట్టడం హాస్యాస్పదంగా ఉందన్నారు. కేటీఆర్ దిష్టిబొమ్మను కాదు కాల్చాల్సింది.. కాంగ్రెస్, బీజేపీ నేతలను నిలదీయాలని డిమాండ్ చేశారు.
కులగణనలో బీసీల జనాభాను తక్కువ చేసి చూపారు. బీసీలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీ హిల్స్ ఉపఎన్నికలో తగిన గుణపాఠం చెప్పాలి. బడుగు బలహీన వర్గాలు అమాయకులని రేవంత్ రెడ్డి అనుకుంటున్నారు. రేవంత్ రెడ్డిని బీసీలు వదిలిపెట్టే ప్రసక్తే లేదు.. తగిన శాస్తి చేస్తారు. రేవంత్ రెడ్డి ఇస్తున్న పదవుల్లో బీసీలకు న్యాయం జరగడం లేదు. రేవంత్ కేబినెట్లో ఏడుగురు బీసీలకు అవకాశం దక్కాలి అని క్యామ మల్లేష్ పేర్కొన్నారు.
రేవంత్ ఓ మేక వన్నెపులి. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు ఉండవు. బీజేపీ నేతలు మాటలు చెప్పడమే తప్ప బీసీ రిజర్వేషన్లపై చిత్తశుద్ధితో వ్యవహరించడం లేదు. మోదీపై కిషన్ రెడ్డి ,బండి సంజయ్ ఎందుకు ఒత్తిడి చేయరు? బీసీలకు రేవంత్ రెడ్డి తన చేతిలో ఉన్న పనులు ఎందుకు చేయరు? బీసీల నోట్లో మన్ను కొట్టే విధంగా పని చేస్తున్న కాంగ్రెస్, బీజేపీలను క్షమించే ప్రసక్తే లేదు అని క్యామ మల్లేశ్ తేల్చిచెప్పారు.