Inter Exams | హైదరాబాద్ : ఈ నెల 5వ తేదీ నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అయితే పరీక్షా కేంద్రాలను 15 నిమిషాల ముందే మూసేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయాన్ని బీఆర్ఎస్ నేత కురువ విజయ్ కుమార్ తప్పుబట్టారు. ఈ నిబంధన వల్ల లక్షలాది మంది విద్యార్థులకు నష్టం కలిగే అవకాశం ఉందన్నారు.
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు సకాలంలో బస్సులు అందుబాటులో ఉండడం లేదు. అదే విధంగా పట్టణ ప్రాంతాలలో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది. కాబట్టి విద్యార్థులు సమయానికి హాజరు కాలేని పరిస్థితి ఏర్పడవచ్చు. 15 నిమిషాల ముందే పరీక్ష కేంద్రాల గేట్లు క్లోజ్ చేయడం వల్ల విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలు చేసుకొనే ప్రమాదం ఉందన్నారు. వారి తల్లిదండ్రులు కూడా మానసిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందన్నారు.
రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని ఇలాంటి నిబంధనతో విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. కావున లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే ఉదయం 8:45 లలోపు హాజరు కావాలనే నిబంధనను వెంటనే తొలగించి పాతపద్దతినే కొనసాగించాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు డా.కురువ విజయ్ కుమార్ డిమాండ్ చేశారు.