KTR | కాంగ్రెస్ అరాచకాలకు అడ్డూ అదుపు లేకుండాపోయిందని.. ఉమ్మడి నల్గొండలో మంత్రుల అరాచకాలను ఎండగడుతామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు పిలుపునిచ్చారు. ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన నేతలతో కేటీఆర్ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు పార్టీని బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై కేటీఆర్ చర్చించారు. పార్టీ చేపట్టనున్న కార్యక్రమాల వివరాలను కేటీఆర్ నేతలకు వివరించారు. పార్టీ ఆధ్వర్యంలో చేపట్టిన కార్యక్రమాలు, పార్టీని ముందుకు నడిపించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా నేతలు మళ్లీ ఫ్లోరోసిస్ రక్కసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక తెరపైకి వస్తోందని జిల్లా నేతలు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
అలాగే, అధికార పార్టీ అరాచకాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రుల ఆధ్వర్యంలో అధికార పార్టీ నేతలు ఎలా జనాన్ని ఇబ్బందులకు గురి చేస్తున్నారో చెప్పారు. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి అడ్డగోలు వ్యవహారాలతో ప్రజల్లో తీవ్ర నిరసన వ్యక్తమవుతుందని.. స్థానిక సమస్యలపై పోరాడాలన్నారు. ఈ సందర్భంగా త్వరలో నల్గొండ జిల్లాలో పర్యటించి.. కాంగ్రెస్ అరాచకాలను ప్రజల దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించారు. సమావేశంలో పాటు ఎమ్మెల్సీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గాదరి కిశోర్ కుమార్, గొంగిడి సునీత, నల్లమోతు భాస్కర్ రావు, కంచర్ల భూపాల్ రెడ్డి, చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్ రెడ్డి, రమావత్ రవీంద్ర కుమార్, బొల్లం మల్లయ్య యాదవ్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్, బూడిద భిక్షమయ్య గౌడ్‌తో పాటు పలువురు నేతలు పాల్గొన్నారు.