Koppula Eshwar | రాష్ట్రంలో నడుస్తున్నది ఇందిరమ్మ రాజ్యం కాదు రాక్షస పాలన అని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మహాలక్ష్మి, రైతు భరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇండ్లు, చేయూత పథకాల కోసం ప్రజాపాలనలోనే దరఖాస్తు చేసుకోవాలని కోరడంతో సుమారు 1.2 కోట్ల మంది దరఖాస్తు చేసుకున్నారని అన్నారు. ఆ తర్వాత 1.17 కోట్ల కుటుంబాల కులగణన సర్వే చేయించిందని.. ఈ వివరాలతో ఆయా పథకాలకు అర్హులను ఎంపిక చేయవచ్చని తెలిపారు. మళ్లీ కొత్తగా దరఖాస్తులు తీసుకోవాల్సిన అవసరం ఏమిటని ప్రశ్నించారు. ఇంతకుముందు చేసిన దరఖాస్తులు ఏమయ్యాయని నిలదీశారు.
కాలయాపన కోసమే కొత్త దరఖాస్తుల ప్రక్రియ మొదలుపెట్టారా అని కొప్పుల ఈశ్వర్ నిలదీశారు. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్న వారికి రేషన్ కార్డులు ఇవ్వరా? కులగణన సర్వేకు రేషన్ కార్డులకు ఎందుకు ముడిపెట్టారు? అని నిలదీశారు. నిరుపేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించి.. ఆదాయ పరిమితిని సడలించారని తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆదాయ పరిమితి గ్రామీణంలో 60వేలు, పట్టణంలో 75వేలు ఉంటే, దాన్ని గ్రామీణంలో లక్షా 50వేలకు, పట్టణంలో 2.50 లక్షలకు పెంచారని చెప్పారు. ఆన్ లైన్లో మీ సేవలో కొన్ని లక్షల మంది దరఖాస్తులు చేసుకున్నారని గుర్తుచేశారు. ప్రజా పాలన సమయంలోనూ దరఖాస్తులు చేశారని తెలిపారు. ఆ దరఖాస్తులు అన్నింటినీ చెత్తబుట్టలో వేశారని విమర్శించారు. ప్రజాపాలనలో 11లక్షల దరఖాస్తులు వస్తే ఎందుకు పరిశీలించడం లేదని ప్రశ్నించారు.
రేషన్ కార్డుల విషయంలో బీఆర్ఎస్ పార్టీ పై ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో 6,47,479 రేషన్ కార్డులును ఇచ్చామని తెలిపారు. 20,69,033 మంది లబ్ధిదారులు అదనంగా రేషన్ ఇచ్చినమని చెప్పారు. నిరుపేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని కేసీఆర్ మానవతా దృక్పథంతో ఆలోచించి.. ఆదాయ పరిమితిని సడలించారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న గ్రామ సభల్లో జాబితాలో తమ పేరు రాలేదని ఆత్మహత్య యత్నానికి పాల్పడుతున్నారు.. అసలు రాష్ట్రంలో ప్రజా పాలన కాదు రాక్షస పాలన నడుస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామసభలు పూర్తిగా పోలీసుల బందోబస్తులో జరుగుతున్నాయని మండిపడ్డారు