హైదరాబాద్, మే 5 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతుల ఆక్రందనను ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేత కోలేటి దామోదర్ ధ్వజమెత్తారు. ఈ మేరకు మంగళవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. రైతు డిక్లరేషన్ పేరుతో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో రేవంత్ సర్కార్ ఘోర వైఫల్యం చెందిందని ఫైర్ అయ్యారు. ‘ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుండదు’ అనే నానుడి గుర్తు చేస్తూ రేవంత్రెడ్డి పాలనలో ఆ రెండూ జరుగుతున్నాయని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ పాలనలో రైతు ఆత్మహత్యలు చూశామని, తిరిగి ఈ కాంగ్రెస్ హయాంలో చూస్తున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. కేసీఆర్ కొట్లాడి తెలంగాణను సాధించి, తన పరిపాలనా దక్షతతో దేశంలోనే గుర్తింపు తీసుకువచ్చారని గుర్తుచేశారు. రాష్ట్రంలో కొనసాగుతున్న కాంగ్రెస్ పరిపాలనా తీరును విశ్లేషించుకోవాలని రైతులకు ఆయన విజ్ఞప్తి చేశారు. తెలంగాణ ప్రయోజనాలపై పోరాడేది బీఆర్ఎస్ మాత్రమేనని, రైతు సదస్సు ద్వారా కాంగ్రెస్ ఇచ్చిన డిక్లరేషన్లపై బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఆరంభం కానుందని కోలేటి దామోదర్ హెచ్చరించారు.