‘ఇది పేదల బడ్జెట్ కాదు. రైతుల బడ్జెట్ కాదు. అంతా గ్యాస్, ట్రాష్ తప్ప ఇందులో ఏమీలేదు. మీ వ్యవసాయ పాలసీ, పారిశ్రామిక పాలసీ, ఐటీ పాలసీ ఏమిటనే దానిపై స్పష్టత ఉన్నదా? ఈ ఏడాది మా లక్ష్యం ఇదీ అని ఎక్కడైనా చెప్పిండ్రా?
-కేసీఆర్
KCR | హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. కాంగ్రెస్‌ను చీల్చి చెండాడుతామని హెచ్చరించారు. గురువారం అసెంబ్లీలో ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క చేసిన బడ్జెట్ ప్రసంగం అనంతరం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద కేసీఆర్ మాట్లాడారు. ‘ఇది పేదల బడ్జెట్ కాదు.. రైతుల బడ్జెట్ కాదు. గ్యాస్, ట్రాష్ తప్ప.. వ్యవసాయ పాలసీ ఏమిటి? పారిశ్రామిక పాలసీ ఏమిటి? ఐటీ పాలసీ ఏమిటి? ఇంకా ఇతర అనేక పాలసీలు.. పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి? అనే ఏ ఒక దానిపైనా స్పష్టత లేదని ఫైరయ్యారు. ‘ఈ పనిని మేం ఇలా సాధిస్తాం.. మా గోల్స్, టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ, పద్దు కానీ లేదు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతు భరోసాపై అనేక ఆంక్షలు పెడుతున్నట్టు ప్రభుత్వం ప్రత్యక్షంగా చెప్తూనే రైతులను మోసం చేసింది అని కేసీఆర్ పేర్కొన్నారు ‘గత ప్రభుత్వం అన్ని వర్గాల సంక్షేమాన్ని, ఆర్థికాభివృద్ధిని కాంక్షించి అనేక పథకాలు ప్రవేశపెట్టింది. యాదవ సోదరుల ఆర్థికాభివృద్ధి కోసం గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రవేశపెట్టింది.
లబ్ధిదారులకు వారు చెల్లించిన డిపాజిట్ డబ్బులు తిరిగి ఇవ్వడం ద్వారా ఈ పథకాన్ని మూసివేసినట్టు అర్థమవుతున్నది. అట్టడుగు వర్గాల గొంతుకోసింది. దళితబంధు ప్రస్తావన లేనేలేదు. ఇది చాలా దుర్మార్గం. దళిత సమాజం పట్ల నిర్లక్ష్యానికి, ఫ్యూడల్ విధానానికి ఇది నిదర్శనం. మత్స్యకారులకు భరోసా లేదు. ఇందులో విశేషం ఏమిటంటే అంకెలు వచ్చినప్పుడల్లా ఆర్థికమంత్రి ఒత్తిఒత్తి పలకడం తప్ప కొత్తగా ఏమీ లేదు’ అని ఎద్దేవా చేశారు. మహిళల పట్ల కూడా చాలా విషయాలు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేనని కేసీఆర్ అభిప్రాయపడ్డారు. ‘కొత్తగా లక్ష కోట్ల వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పారు. ఇవి రుణాలు, వాళ్లు ఇచ్చేది ఏముంటది? అది ఆల్రెడీ ఉన్న సీమే. దురదృష్టం ఏందంటే.. ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మేం కూడా కనీసం ఆరుమాసాల సమయం ఇవ్వాలనుకున్నాం. నేను కూడా పెద్దగా శాసనసభకు రాలేదు. కానీ, బడ్జెట్ చూస్తే ఏ ఒక పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించిన ఏ ఒక విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటివరకు పాలసీ ఫార్ములేషన్ చేసినట్టుగా కనబడుత లేదు’ అని విమర్శించారు.

‘వ్యవసాయం విషయంలో మాకు స్పష్టమైన అవగాహన ఉండే. రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని, మేం రెండు పంటలకు రైతుబంధు ఇచ్చాం. వీళ్ల్లేమో ఎగ్గొడుతామని చెప్తున్నారు. రైతులకు ఇచ్చిన డబ్బును పాడు చేసినం.చెడగొట్టినం. దుర్వినియోగం చేసినం అనే పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు’ అని కేసీఆర్ మండిపడ్డారు. ఈ ప్రభుత్వం తన చర్యల ద్వారా తమది పూర్తిగా రైతు శత్రువు ప్రభుత్వం అని చెప్తున్నదన్నారు.. ‘ధాన్యం కొనుగోలు చేయలేదు. విద్యుత్తు సరఫరా చేయడం లేదు. నీళ్లు సరఫరా చేయడం లేదు. రైతులను చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఇంకా రైతుబంధు, రైతుభరోసా ప్రస్తావనే లేదు. రైతుభరోసా ఎప్పుడు వేస్తారని మా ఎమ్మెల్యేలు అరిస్తే కనీసం సమాధానం చెప్పడం లేదు. రైతులను ఈ ప్రభుత్వం వంచించింది. వృత్తి కార్మికులను వంచించింది’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇండస్ట్రీయల్ పాలసీ ఏమిటి? ఏం లేదు వట్టిదే గ్యాస్.. ట్రాష్. ఇదేదో స్టోరీ టెల్లింగ్‌లాగా ఉంది తప్ప బడ్జెట్ లాగా లేదని కేసీఆర్ పేర్కొన్నారు. ‘రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి? పారిశ్రామిక పాలసీ ఏమిటి? ఐటీ పాలసీ ఏమిటి? ఇంకా ఇతర అనేక పాలసీలు.. పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి? అనే ఏ ఒక దాని మీద కూడా స్పష్టత లేదు. అంత వట్టిదే గ్యాస్, ట్రాషే. చిల్లరమల్లర ప్లాట్‌ఫామ్స్ స్పీచ్లాగా ఉన్నది తప్ప బడ్జెట్ ప్రసంగంలా లేదు. రాజకీయ సభల్లో చెప్పినట్టుగా ఉంది తప్ప ఏ ఒక పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేం ఇలా సాధిస్తాం.. మా గోల్స్, టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ, పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు. రైతుల బడ్జెట్ కాదు. ఎవరి బడ్జెటో విశ్లేషణలో తెలుస్తది. భవిష్యత్తులో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలి పెట్టం. చీల్చి చెండాడుతాం’ అని కేసీఆర్ హెచ్చరించారు.