Jeevan Reddy | నిజామాబాద్, ఆగస్టు 5: తెలంగాణ వరప్రదాయనిగా వరల్డ్ ఫేమస్ కాళేశ్వరం ద్వారా రాష్ట్రాన్ని ధాన్యాగారంగా మార్చిన అపరభగీరథుడు కేసీఆర్‌కు కారాగారమా? అని బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్ రెడ్డి మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అపోహలను తొలగించేందుకు మాజీ మంత్రి హరీశ్‌రావు ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎల్ఈడీ స్క్రీన్‌పై ఆయన తిలకించారు.
అనంతరం విలేకరుల సమావేశంలో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. కాళేశ్వరంపై కాంగ్రెస్, బీజేపీలు సృష్టించిన అపోహాలను హరీశ్‌రావు పటాపంచలు చేసి తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పూర్తి అవగాహన కల్పించారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ ఇచ్చిన బోగస్ నివేదిక ఆధారంగా కేసీఆర్ జోలికొస్తే తెలంగాణ ప్రజలు తిరగడతారని ఆయన హెచ్చరించారు. కేసీఆర్‌పై కక్ష సాధింపు చర్యలు, ఎలాగైనా ఆయనను అరెస్టు చేసి జైలులో పెట్టాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగిస్తున్న కుటిల కుతంత్రాలకు ఫుల్ స్టాఫ్ పెట్టకపోతే తెలంగాణ చరిత్ర తిరగరాసేలా మరో మహా సంగ్రామానికి తెరదీస్తామని జీవన్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ కుట్ర రాజకీయాలను ఎదుర్కోవడానికి ప్రజలతో కలిసి మహాయుద్ధం చేయడానికి గులాబీ శ్రేణులు సిద్ధంగా ఉన్నాయని ఆయన చెప్పారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం చేపట్టిన మలి విడత ఉద్యమం తొలి రోజు నుంచి కేసీఆర్ కు వెన్నుదన్నుగా నిలిచిన గులాబీ ఖిల్లా నిజామాబాద్ జిల్లా నుంచే మళ్లీ కాంగ్రెస్ అకృత్య పాలనపై సమరశంఖం పూరిస్తామని జీవన్ రెడ్డి ప్రకటించారు.
తెలంగాణ సమాజమంతా ఏకమై కాంగ్రెస్ కుటిల కోటలు బద్దలు కొడతామని జీవన్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కుట్రలను ఎండగడతామని ఆయన స్పష్టం చేశారు. ఇదిలాఉండగా కాళేశ్వరం ప్రాజెక్టుపై ఘోష్ కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ కాంగ్రెస్ అవినీతి బయోపిక్ లా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. కాళేశ్వరం రిపోర్ట్ నిరాధార అవినీతి, బూతులు, అబద్దాలతో వండివార్చిన కాంగ్రెస్ వంటకమని ఆయన వ్యాఖ్యానించారు. ఆది నుంచి తెలంగాణ విలన్ పాత్ర పోషించిన కాంగ్రెస్ నేతలు.. కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పాలన చూసి కండ్లలో నిప్పులు పోసుకుంటున్నారని ఆయన ధ్వజమెత్తారు. తడారి ఎడారిగా మారిన తెలంగాణ భూములు పచ్చ బారెలా చేసిన కాళేశ్వరం జలధారలు చూసి కాంగ్రెస్ నాయకుల కండ్లు ఎర్రబారుతున్నాయన్నారు.
తెలంగాణ రాష్ట్రం బాగుపడటం ఓర్వలేని ద్రోహులంతా ఒక్కటై కేసీఆర్ పై కక్ష గట్టారని జీవన్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం తెచ్చి దశాబ్దాల కల నెరవేర్చడమే కాక అద్భుతమైన పాలనతో అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపిన తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పై నీలాపనిందలు వేసి విచారణల పేరుతో వేధిస్తూ అవమానాలకు గురిచేయడం దారుణమని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ అరాచక పాలన చూస్తుంటే అలనాడు భద్రాచలంలో రామందిరం నిర్మించిన రామదాసును జైల్లో పెట్టినట్లు తెలంగాణ ప్రజల కొంగు బంగారం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన కేసీఆర్‌ను కూడా జైలులో పెట్టాలని కుట్ర చేస్తున్నట్లుందని ఆయన పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ఒక ఆధునిక దేవాలయమని, కాళేశ్వరం దేశానికే అన్నం పెట్టే మహాజలశక్తి పీఠమని ఆయన అభివర్ణించారు. తెలంగాణలో కరువుకాటకాలకు, ప్రజల కన్నీళ్లకు శాశ్వత పరిష్కారం కాళేశ్వరం నీళ్లు అని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణ నాశనం కోరుకునే వంకరబుద్ధి గాళ్లకు ఈర్శ్య, అసూయ పుట్టించే విధంగా జలాభిషేకం చేసిన వరప్రదాయిని కాళేశ్వరంపై విషం కక్కుతున్నారని ఆయన విమర్శించారు. గోదావరిలో తెలంగాణ వాటాగా దక్కే ప్రతి నీటి చుక్కని ఒడిసిపట్టే కేసీఆర్ ఆలోచన ఫలితమే కాళేశ్వరం అద్భుతమైన జలదృశ్యమన్నారు.