Jagadish Reddy | రైతులు, ప్రజల్లో వ్యతిరేకతను అణిచివేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం చిల్లర ప్రయత్నం చేస్తోందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలే తిరగబడుతున్నారని.. ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీస్తున్నారని తెలిపారు. దీనికి గ్రామసభల్లోని ప్రజల అభిప్రాయాలే నిదర్శనమని పేర్కొన్నారు. నల్గొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో జగదీశ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. పోరాటాలకు సిద్ధపడిన ప్రజలకు నాయకత్వం వహించాల్సిన బాధ్యత తమపై ఉందని తెలిపారు.
కాంగ్రెస్, బీజేపీలు కలిసి ప్రజలను దోచుకుంటున్నాయని జగదీశ్‌రెడ్డి ఆరోపించారు. ఈ పరిస్థితిల్లో తెలంగాణ ప్రజల ప్రయోజనాలకు కోసమే కేసీఆర్, బీఆర్ఎస్ నిలబడుతున్నదని తెలిపారు. ప్రభుత్వం చేతిలో మోసపోయిన రైతాంగం తరపున కేటీఆర్‌ను పిలిచి ఆందోళనకు సిద్ధం అవుతున్నారని పేర్కొన్నారు. కరెంట్ కోతలు, ఎరువుల కొరత, రైతు బంధు, రుణమాఫీ కోసం రైతులు ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అందుకే క్లాక్ టవర్ లో ధర్నా కు సిద్ధమని అన్నారు. దీన్ని అడ్డుకోవాలని ప్రభుత్వం చూసినప్పటికీ న్యాయస్థానం తమకు అండగా నిలిచిందని తెలిపారు. కోర్టు అనుమతితో ఈ నెల 28 వ తేదీన 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ధర్నా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. దీనికి పోలీస్ యంత్రాంగం, అధికారులు సహకరిస్తారని ఆశిస్తున్నామని అన్నారు.
నల్గొండ జిల్లా మంత్రికి దోచుకోవడం, దాచుకోవడమే సరిపోతుందని జగదీశ్ రెడ్డి విమర్శించారు. రైతులను మోసం చేస్తూ మిలర్ల దగ్గర కమిషన్ తీసుకుంటున్నారని ఆరోపించారు. జిల్లా రైతులను వెయ్యి కోట్ల వరకు మోసం చేశారని అన్నారు. దీనిపై రైతులు, ప్రజలు ప్రశ్నిస్తుంటే దాడులు చేయిస్తున్నారని చెప్పారు. నల్గొండకు ఒక్క రూపాయి కొత్తగా తెచ్చింది లేదని విమర్శించారు. జిల్లా ప్రజలు దీన్ని గమనించాలని సూచించారు. జిల్లా మంత్రి చేస్తున్న మోసాలపై రైతులు కదిలి రావాలని పిలుపునిచ్చారు.
తుమ్మల నాగేశ్వర్ రావు.. మీకు ధైర్యం ఉంటే.. వ్యవసాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తే.. ఇప్పటి వరకు కొన్న ధాన్యం ఎంతనో… చెల్లించిన బోనస్ ఎంతనో చెప్పాలని జగదీశ్ రెడ్డి సవాలు విసిరారు. ఇప్పటివరకు ఎంత ధాన్యం కొన్నారో చెప్పలేని దద్దమ్మ ప్రభుత్వం ఇది అని ఎద్దేవా చేశారు. ఏ ముఖం పెట్టుకుని రైతుల విషయం మట్లాడుతున్నారో చెప్పాలని మండిపడ్డారు. రైతులను చూసి ఉచ్చ పోసుకుని పారిపోతున్నారని విమర్శించారు. ఆంధ్రా నుంచి కొట్లాడి కృష్ణా నీళ్లు తెచ్చి పారించిన ఘనత తమదని గుర్తుచేశారు. 40 లక్షల టన్నుల ధాన్యం పండిచి నల్లగొండను అన్నపూర్ణగా మార్చిన ఘనత తమది అని అన్నారు. అందుకే ప్రజల్లోకి ధైర్యంగా వస్తున్నామని స్పష్టం చేశారు.
గ్రామ సభల లిస్ట్‌లపై ప్రభుత్వం తిరోగమనం పట్టిందని జగదీశ్ రెడ్డి అన్నారు. ఇప్పటికే మూడు సార్లు దరఖాస్తు చేస్తే అవి ఎటూ పోయాయో కూడా తెలియదని అన్నారు. దరఖాస్తు ఫారాలు కూడా అమ్ముకునే దౌర్భాగ్యాలు మన కాంగ్రెస్ నేతలు అని ఎద్దేవా చేశారు. మళ్లీ దరఖాస్తులు ఎందుకు చెప్పాలని నిలదీశారు.