Jagadish Reddy | సీఎం రేవంత్ రెడ్డి భాషలో ఎలాంటి మార్పు రాలేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత జగదీశ్ రెడ్డి అన్నారు. ముఖ్యమంత్రి అనే సోయి లేకుండా దిగజారుడు వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆయన భాష తీరే ఆయన్ను బొందపెడుతుందని వ్యాఖ్యానించారు. అదే భాష, అవే పదాలు.. ముఖ్యమంత్రి స్థాయి వచ్చినా ఆయన మూర్ఖత్వం తగ్గడం లేదని ఎద్దేవా చేశారు.
హుజూర్నగర్ సభలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. అవే పచ్చి అబద్ధాలు, అర్థం లేని ఆరోపణలతో పబ్బం గడుపుతున్నాడని విమర్శించారు. అధికారంలోకి వచ్చి 15 నెలలు గడిచినా కేసీఆర్ మాట లేకుండా ఏ సభ సాగట్లేదని వ్యాఖ్యానించారు. సోనియా గాంధీ ఆరు గ్యారంటీలను నమ్మి ప్రజలు మోసపోయారు తప్ప.. రేవంత్ రెడ్డి మూర్ఖత్వపు మాటలకు కాదని స్పష్టం చేశారు.
కాళేశ్వరాన్ని కేసీఆర్‌కు అప్పగిస్తే మూడు రోజుల్లో నీళ్లు ఇచ్చి చూపిస్తామని చెప్పినా సీఎం రేవంత్ రెడ్డి నుంచి ఎలాంటి స్పందన లేదని జగదీశ్ రెడ్డి తెలిపారు. కాంగ్రెస్ పాలనలో మళ్లీ రైతులకు కష్టాలు మొదలయ్యాయని, పంట పొలాల వద్ద అన్నదాతలు కన్నీళ్లు పెడుతున్నారని అన్నారు. కడుపుమండిన రైతులు, మహిళలు ప్రభుత్వానికి, రేవంత్‌రెడ్డికి శాపనార్థాలు పెడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం ఇస్తామన్న రైతు రుణమాఫీ లేదు.. రైతుబంధు లేదు.. రైతు బీమా లేదు.. ప్రతీది మభ్యపెట్టి మోసం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బోనస్ ఇవ్వాల్సి వస్తుందని అసలు ధాన్యమే కొనడం లేదని అన్నారు. ఉన్న ధాన్యం ఎంత అంటే ఎక్కడా సమాధానం లేదని చెప్పారు. ప్రతిపక్ష నాయకుల ఫోన్లను అధికారులు ఎత్తడమే మానేశారని పేర్కొన్నారు. వానాకాలంలో ఏ పంట ఎంత కొన్నారని ప్రశ్నించారు. దొడ్డు రకానికి బోనస్ ఇస్తామని మాటమార్చి సన్నధాన్యానికే బోనస్ ఇస్తామని చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
నిన్న హుజూర్ నగర్లో నిర్వహించిన సభలో సీఎం రేవంత్ రెడ్డి అదే మూర్ఖత్వాన్ని, అజ్ఞానాన్ని ప్రదర్శించాడని జగదీశ్ రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ను తిట్టడం తప్ప ఆయనకు వేరే పనే లేదని అన్నారు. కేసీఆర్‌పై విషం కక్కి ప్రజాక్షేత్రంలో బతకడం సాధ్యం కాదని అన్నారు. ఇంకా మూడేళ్లు అధికారంలో ఉంటారని తెలిసి కూడా కాంగ్రెస్ ప్రభుత్వ తీరును ప్రజలు భయపడకుండా ఎండగడుతున్నారని తెలిపారు. కేసీఆర్‌కు ఉరివేస్తానని రేవంత్ రెడ్డి అంటున్నారని.. ప్రజలే రేవంత్‌కు ఉరివేసే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ప్రజలు తిరగబడితే ఎలా కూలియాయో ఒకసారి పక్కదేశాలను చూస్తే తెలుస్తుందని హితవుపలికారు.
సీఎం రేవంత్ రెడ్డి తన పద్ధతి, భాష మార్చుకోవాలని, రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని జగదీశ్ రెడ్డి సూచించారు. గత ఏడాది కొన్న సన్న వడ్లు ఎన్ని.. ఇచ్చిన బోనస్ ఎంతో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రబీ ధాన్యం కొనుగోలు చేసేందుకు ఇప్పటివరకు ఎలాంటి సమీక్షలు చేయలేదు.. అసలు కొనుగోలు చేస్తారా లేదా తెలియట్లేదని సందేహం వ్యక్తం చేశారు. నీళ్లు ఇవ్వమంటే రైతులు పొలాలు వేసుకోరని అన్నారు. నీళ్ళు ఇస్తామని నేడు ఇవ్వకపోవడంతో వేలాది ఎకరాలు నష్టపోయారని తెలిపారు. ఒక తడికి ఇస్తే వేలాది ఎకరాలు పెట్టుబడి అయినా వస్తుంది.. చివరి భూముల వరకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోళ్లపై వెంటనే ఒక ప్రకటన చేయాలన్నారు.
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మేడిగడ్డ నుంచి 9 లక్షల క్యూసెక్కుల నీరును పారించామని జగదీశ్ రెడ్డి గుర్తుచేశారు. కన్నెపల్లి పంప్ హౌస్ బాగానే ఉందని అధికారులు చెబుతున్నారని.. అయినా నడిపించే సోయి ప్రభుత్వానికి లేదని అన్నారు. NDSA ఒక సాకుతో కాళేశ్వరం నీళ్లు రాకుండా అడ్డుకుంటున్నారని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబు నిబంధనలు తుంగలో తొక్కి నీళ్లు తీసుకుపోతుంటే ఇక్కడి ప్రభుత్వానికి సోయిలేదని మండిపడ్డారు. రైతులు మేలుకోవాలని.. కాళేశ్వరం కొనసాగింపుకు మరో ఉద్యమం చేయాలని పిలుపునిచ్చారు.