Jagadish Reddy | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగల తొక్కి.. అణిచివేతతో పాలన సాగించాలని చూస్తున్నారని కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రులు పాలనను గాలికొదిలేసి.. స్కాముల్లో పోటీపడుతున్నారని విమర్శించారు.
బీఆర్ఎస్ నియోజకవర్గస్థాయి వర్క్‌షాపులో భాగంగా తొలిరోజు సూర్యాపేట టౌన్, రూరల్, ఆత్మకూర్(ఎస్) మండలాల ముఖ్యనేతల సమావేశం శుక్రవారం జరిగింది. సూర్యాపేటలోని ఎన్ఎస్ ఫంక్షన్ హాలులో జరిగిన ఈ వర్క్‌షాపులో మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పాల్గొని బీఆర్ఎస్ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు. నిత్యం ప్రజల్లో ఉండి ప్రజా సమస్యలపై పోరాడాలని సూచించారు. ప్రజల పక్షాన అండగా నిలబడాలని అన్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఆరు గ్యారంటీలు ఏమయ్యాయని అడుగడుగునా నిలదీయాలని తెలిపారు.
కాంగ్రెస్ పాలకులు అభివృద్ధి చేయకపోగా.. భయబ్రాంతులకు గురిచేస్తున్నారని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్ ఇచ్చిన హామీలను బంద్ పెట్టి.. రైతుల నోట్లో మన్ను గొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేం అరాచకాలు సృష్టిస్తామని.. దానిపై ప్రశ్నిస్తే కేసులు పెడతామని బెదిరిస్తున్నారని మండిపడ్డారు. అధికారం కట్టబెట్టిన ఏడాదిలోపే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో తిరుగుబాటు మొదలైందని అన్నారు. తమ సమస్యలను చెప్పుకునేందుకు నిత్యం తెలంగాణ భవన్ ముందు ప్రజలు బారులు తీరుతున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ అరాచకాలకు మహిళలు సైతం బయటకు వచ్చి పోరాడతామని అంటున్నారని జగదీశ్ రెడ్డి తెలిపారు. అందుకే ఈ ఆపద సమయంలో బీఆర్ఎస్ శ్రేణులు ప్రజలకు అండగా నిలబడాలని సూచించారు. మనం చేసిన అభివృద్ధిని ఆగం చేస్తామంటే చూస్తూ ఊరుకుందామా అని ప్రశ్నించారు. కేసీఆర్, బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ అభివృద్ధి కోసమని తెలిపారు. మన సంపద దోచిపెడతాం.. అభివృద్ధిని అటకెక్కిస్తామంటే ఊరుకునేదే లేదని పేర్కొన్నారు.