Jagadish Reddy | బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇంటిపై పోలీసులు దౌర్జన్యంగా దాడి చేయడాన్ని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఖండించారు. కారణం, వారెంట్ లేకుండా ఎలా సోదాలు చేస్తారని ప్రశ్నించారు. ప్రతిపక్ష పార్టీ నేత ఇంటిపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఎక్కడో ఏదో జరిగితే కేటీఆర్‌కు సంబంధమేంటని నిలదీశారు.
సీఎం రేవంత్ రెడ్డి సోదరులపై చాలా ఆరోపణలు వస్తున్నాయని జగదీశ్‌రెడ్డి అన్నారు. రేవంత్ సోదరుల ఇళ్లపై ఇలాగే చేసే దమ్ముందా అని పోలీసులను ప్రశ్నించారు. స్వయంగా పోలీసులే రేవంత్ రెడ్డి తమ్ముడితో సెటిల్ చేసుకోమని బాధితులకు చెబుతున్నారని అన్నారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి డ్రామాలు ఆడుతున్నాయని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. పై నుంచి మోదీ, ఆదానీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని ఆరోపించారు. నిజాం కాలంలో కూడా ఇంతలా దుర్మార్గం లేదని అన్నారు.
చిల్లర దాడులు తమను భయపెట్టలేవని జగదీశ్ రెడ్డి అన్నారు. తమకు అరెస్టులు కొత్త కాదని తెలిపారు. ఎఫ్ఐఆర్, సెర్చ్ వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల్లో వస్తున్న వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకే ఇలాంటి దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతగా ప్రజల్లో KTR కి వస్తున్న ఆదరణ తట్టుకోలేకే దాడులు చేస్తున్నారని విమర్శించారు. ప్రజా గొంతుకైన KTR కి సమాధానం చెప్పలేక రేవంత్ రెడ్డి చిల్లర వేషాలు వేస్తున్నారని అన్నారు.
బిఆర్ యస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ @KTRBRS గారి ఇంటి పై దౌర్జన్యంగా దాడి చేయడం ఖండిస్తున్నాం
కారణం, వారెంట్ లేకుండా సోదాలు ఎలా చేస్తారు..
ప్రతిపక్ష పార్టీ నేత ఇంటిపై పోలీసులు దుర్మార్ఘంగా వ్యవహరిస్తున్నారు
ఎక్కడ ఎదో జరిగితే అది కేటీఆర్ కి ఎం సంబంధం
రేవంత్ సోదరులపై చాలా… pic.twitter.com/vllbi8fBiN
— Jagadish Reddy G (@jagadishBRS) October 27, 2024
మంత్రి పొంగులేటి ఇంట్లో విదేశీ వాచీల వ్యవహారం ఎటుపోయిందని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు. మంత్రుల ఇళ్లలో సోదాలు చేస్తే మీరు అనుకున్నవి దొరుకుతాయని అన్నారు. ఎన్ని కుట్రలు చేసినా తమ ప్రజా పోరాటం ఆగదని స్పష్టం చేశారు. కేటీఆర్‌ను ప్రజలే రక్షించుకుంటారని అన్నారు. సెక్యూరిటీ లేకుండా వస్తే కేటీఆర్, రేవంత్ రెడ్డిలో ఎవరికి ఎంత ఛరీష్మా ఉందో తెలుస్తుందని అన్నారు
తెలంగాణలో గృహ ప్రవేశానికి దావత్ జరగడం సర్వ సాధారణమని జగదీశ్ రెడ్డి తెలిపారు. మంత్రులే పట్టపగలు తాగి తిరుగుతున్నారని.. వారికి పరీక్షలు చేస్తారా అని ప్రశ్నించారు. లేనివి ఉన్నట్టు సృష్టించి కేసులు బనాయించాలని చూస్తున్నారని మండిపడ్డారు. మీరు ఎంత దుర్మార్గానికి దిగజారినా.. KTR ఇమేజ్ పెరుగుతుంది తప్ప తగ్గదని స్పష్టం చేశారు. చట్ట పరిధిలో పనిచేయకపోతే డీజీపీ సమాధానం చెప్పాల్సి ఉంటుందని అన్నారు. తప్పకుండా తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. కాంగ్రెస్ చెప్పినట్లు కాకుండా పోలీసులంతా చట్ట పరిధిలో పనిచేయాలని హితవు పలికారు. రౌడీల్లాగా చట్టవిరుద్దంగా పోలీసులు వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా రావడాన్ని ఎలా అర్థం చేసుకోవాలని ప్రశ్నించారు. వెంటనే సోదాలు అపి పోలీసులు వెనక్కి రావాలని.. దాడులు ఇలాగే కొనసాగితే పోలీసులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.