Jagadeesh Reddy | నల్లగొండ ప్రతినిధి, మార్చి 18(నమస్తే తెలంగాణ) : ‘పంటలెండిన బాధలో కడుపుమండి తిట్టినోళ్లను బట్టలిప్పించి కొడుతమనుడు కాదు.. మాట తప్పిన కాంగ్రెసోళ్లు కనిపిస్తే మేమే బట్టలిప్పించి కొడుతం.. ఓట్లకొస్తరు కద.. అప్పుడు నడిరోడ్డు మీద నిలబెడుతం.. నీళ్ల కోసం కొట్లాటకు అవసరమైతే అసెంబ్లీకైనా వస్తం. ఇక్కడ దగ్గర దగ్గర వెయ్యి ఎకరాల దాక ఎండిపోయింది. ఈ రైతుల గోస ఎవలుసూడాలె’ అంటూ పెన్‌పహాడ్ మండల రైతులు ప్రభుత్వంపై తమ ఆక్రోశాన్ని వెల్లగక్కారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండలంలోని పలు తండాల్లో ఎండిన పంటలను పరిశీలించేందుకు మంగళవారం వెళ్లగా ఆయన ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు. ‘సర్కారు నీళ్లిస్తమంటే.. కాల్వ నీళ్లు వస్తయని నమ్మి పదెకరాల్లో వరి పొలం పెట్టిన. కాల్వ నీళ్లకు తోడు 10 బోర్లు కూడా పోసేవి. కానీ కాల్వ నీళ్లు రాలేదు.
చుక్క నీరు పొలంలో పారలే. ఉన్న బోర్లు ఎండిపోయినయ్. పొలం ఎనకపట్టు పట్టింది. సూర్యాపేటలో కాంగ్రెస్ నేత దామోదర్‌రెడ్డి దగ్గరకు నీళ్ల కోసం పోయినం. మాకేసిర్రా ఓటు.. సూర్యాపేటలో మేం గెలిచినమా? అన్నడు. పొలం కండ్ల ముందే ఎండిపోయింది. పదెకరాలు ఎండుగడ్డిలా మారింది. గొర్రెల మేతకు ఇచ్చిన. కేసీఆర్, మీరు (జగదీశ్‌రెడ్డి) ఉన్నప్పుడే మాకు నీళ్లొచ్చినయ్. ఇప్పటికంటే కరువున్నా.. ఎక్కడి నుంచో నీళ్లు తెచ్చి మా పొలాలకు పారిచిండ్రు. మీ పాలన పోయింది.. నీ ళ్లు కూడా పోయినయ్. నాలుగు లక్షల అప్పు చేసి పొలం పెట్టిన. ఆ అప్పెట్ల తీరాల్నో.. కుటుంబం ఎట్ల గడువాల్నో తెలుస్తలేదు’ అంటూ దుబ్బతండాకు చెందిన రైతు భూక్యా జామ్లానాయక్ ఆవేదన వ్యక్తంచేశాడు.
‘కాల్వకు నీళ్లు వదులుతమంటే మూడెకరాల వరిచేను పెట్టిన. అట్లా ఎదుగుతున్న చేను నీళ్లు లేక మొత్తం ఎండింది. పంటెండుతుంటే పుస్తెలతాడు కుదువ పెట్టి మూడు బోర్లేసిన. చుక్క నీళ్లు రాలే. మొత్తం ఇట్లనే ఎండిపోయిం ది. చేసేది లేక గొర్రెల మేతకు పొలం ఇచ్చిన. మా చుట్టుపక్కల మూడు, నాలుగు తండాల్లో పంటలన్నీ ఇట్లనే ఎండినయ్. కాంగ్రెసొచ్చిం ది.. తండాల్లో కరువు చూస్తు న్నం’ అంటూ రత్యాతండాకు చెందిన భూక్యా మంగమ్మ మండిపడింది.
‘అప్పట్లో నీళ్లు లేక వరి పెట్టకపోయేది. జొన్నలు వేసి గొడ్లను సాదుకునేది. కేసీఆర్ సర్కారు పోయినంక మళ్లీ అప్పటి రోజులే కనిపిస్తున్నయ్. మాకు కాళేశ్వరం నుంచి కాల్వ ద్వారా ఐదారేండ్లు పుష్కలంగ నీళ్లచ్చినయ్. చూద్దామని ఓసారి కాంగ్రెస్‌కు ఓటేసినం. మోసపోయి నరకం చూస్తున్నం. అప్పులిచ్చినోళ్లకు ఏం చెప్పాలె? చావుతప్ప ఏమీ కనిపిస్తలేదు’ అంటూ దుబ్బాతండాకు చెందిన నూనావత్ అనిల్ ఆక్రోశం వెలిబుచ్చాడు.
‘ఎకరాకు 30 వేలు పెట్టుబడి పెట్టినం. పంట మొత్తం పోయింది. మాకు నీళ్లొస్తలేవు. కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు మంచిగ వస్తుండె. ఇప్పుడు నీళ్లు లేక పంట మొత్తం పోయింది. రైతుబంధు రాలేదు. రుణమాఫీ కాలేదు. సన్నవడ్లు వెయ్యిండ్రంటే వేసినం. బోనస్ ఇయ్యలేదు. ఇంత ఘోరం ఎప్పుడు లేదు. మళ్లా ఓట్లొస్తే కాంగ్రెస్సోళ్ల సంగతి చెప్తం’ అంటూ రత్యాతండా భూక్య విజయ రగిలిపోయింది.
గతంలో కాళేశ్వరం నుంచి వచ్చిన గోదావరి జలాలతో సస్యశ్యామలమైన సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్ మండల పరిధిలో ఇప్పుడు ఏ రైతును కదిలించినా ఇదే ఆవేదన కనిపిస్తున్నది. దారి పొడవునా ఎండిన పొలాల్లో నిలబడి మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డికి తమ గోడు చెప్పుకొనేందుకు రైతులు ఎదురుచూస్తూ కనిపించారు. దుబ్బతండా, రత్యాతండా పరిధిలో మచ్చుకు కొన్ని పొలాలను పరిశీలించే ప్రయత్నంలో ఏ రైతును కదిలించినా కన్నీటి గాథలే వినిపించాయి. కేసీఆర్ అప్పుడు ఎన్నడూ ఇట్ల కాలే. కాంగ్రెసొచ్చింది. కరువు తెచ్చింది. ఎైట్లెనా చేసి నీళ్లు ఇప్పించే ఆలోచన చేయిండ్రి. మీ వెంట కొట్లాటకు ఎక్కడికైనా వస్తం. అసెంబ్లీకి రమ్మన్నా వస్తం’ అంటూ పలువురు జగదీశ్‌రెడ్డికి మొరపెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టి కాళేశ్వరం జలాలు విడుదల చేయకపోవడంతో యాసంగి పంటలన్నీ ఎండుతుంటే ఏం చేయాలో తెలియక రైతులు దిక్కులు చూస్తున్నారు.
దుబ్బతండా, రత్యాతండాలో వరి సాగు చేసిన ప్రతి రైతుకు చెందిన ఎంతో కొంత భూ మి ఎండిపోయింది. జనవరి ఒకటి నుంచి మార్చి 31 వరకు ఒక్కో జోన్‌కు ఒక్కో వారం చొప్పున వారబందీ పద్ధతిలో నీళ్లిస్తామని ప్రభుత్వం చెప్పింది. తీరా పొలాలు పెట్టి వరి పొట్ట దశకు వచ్చే సరికి కాల్వకు నీళ్లు విడుదల చేయలేదు. దాంతో ప్రతి ఊళ్లో వందల ఎకరాలు ఎండిపోయాయి. ఈ సీజన్లో ఒక్కో రైతు కనీసం రెండు, మూడు బోర్లు వేసినా చుక్క నీరు రాలేదు.
‘మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఒక్కటే అడుగుతున్న. ఇప్పటికైనా ఏక్కడి నుంచైనా సరే నీళ్లు తెచ్చి ఎండుతున్న పొలాల్లో పారించి పంటలు కాపాడితే ఆ నీళ్లతోనే ఉత్తమ్ కాళ్లు కడిగి నా నెత్తిన పోసుకుంటా’ అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. ‘కాళేశ్వరాన్ని బందు పెట్టి దుర్మార్గంగా వేల ఎకరాలు ఎండబెడుతున్నరు. రైతుల మీద కక్షగట్టినట్టు వ్యవహరిస్తున్నరు.. మీకు చేతగాకపోతే కాళేశ్వరాన్ని ఇప్పటికైనా కేసీఆర్‌కు అప్పజెప్పండి.. మూడు రోFజుల్లోనే సూర్యాపేట జిల్లా వరకు నీళ్లు పారిస్తం.. ఉత్తమ్ పద్మావతి నియోజకవర్గమైన కోదాడలోని చివ రి గ్రామం వరకు నీళ్లందించి చూపిస్తం’ అంటూ సవాల్ చేశారు.
‘కాళేశ్వరాన్ని కాదని ప్రత్నామ్నాయంగా నీళ్లు తెచ్చి ఒక్క ఎకరానికి అందించినా నీ కాళ్లు కడిగి నెత్తిన పోసుకునేందుకు సిద్ధం’ అం టూ ఉత్తమ్‌కు సవాల్ విసిరారు. సూర్యాపేట జిల్లాలో ఎటుచూసినా కిలోమీటర్ల మేర పంటలు ఎండిపోయాయని, నెల నుంచి ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినా స్పందన లేదని విమర్శించారు. రైతుల కష్టాలు, కన్నీళ్లను అసెంబ్లీలో ప్రస్తావించే ప్రయత్నం చేస్తే సస్పెండ్ చేసి కక్ష సాధింపు చర్యలకు దిగారని వాపోయారు. ‘ఇది ప్రకృతితో వచ్చిన నష్టం కాదు.. ప్రభుత్వం నీళ్లు ఇస్తానంటేనే రైతులు పంటలు వేశారు.. తీరా పంట చేతికి వచ్చే సమయంలో నీళ్లు బంద్ చేశారు.. అందుకే ఎకరాకు ప్రభుత్వం రూ.30 వేల నష్టపరిహారం ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. ప్రభు త్వం మీద యుద్ధం చేసేందుకు రైతులు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.