Harish Rao | రెండేళ్లుగా రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయాలని విద్యాసంస్థల యాజమాన్యాలు మొత్తుకుంటున్నా రేవంత్ సర్కారు మొద్దు నిద్ర నటిస్తుండటం సిగ్గుచేటు అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు విమర్శించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరుబాట అంటూ పీడీఎస్‌యూ రూపొందించిన బిగ్ డిబేట్ పోస్టర్‌ను హైదరాబాద్‌లోని తన నివాసంలో హరీశ్‌రావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రాష్ట్రవ్యాప్తంగా డిగ్రీ, పీజీ, ఫార్మసీ, బీఈడీ, ఎంబీఏ, ఎంసీఏ, ఇంజినీరింగ్ విద్యాసంస్థలు మూతపడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 13 లక్షల విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని అన్నారు. సెమిస్టర్ పరీక్షలు కూడా వాయిదా వేసే పరిస్థితి వస్తుంటే విద్యాశాఖ మంత్రిగా కూడా ఉన్న ముఖ్యమంత్రి ఏం చేస్తున్నట్లు అని నిలదీశారు.
సోమవారం నుంచి నిరసనలు, నిరాహార దీక్షలు, నిరవధిక బంద్‌లు చేయనున్నట్లు ప్రకటించినప్పటికీ ఎందుకు నోరు మెదపడం లేదని సీఎం రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు. ‘అల్లరి చేయొద్దు’ అని ఆర్థిక మంత్రి సుద్దులు చెప్పినంత మాత్రాన యాజమాన్యాలు, విద్యార్థుల గోడు తీరదని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు, ఫీజు రీయింబర్స్ ఇవ్వడానికి లేని డబ్బులు ముఖ్యమంత్రి కమిషన్ల ప్రాజెక్టులకు ఎలా వస్తున్నాయి? అని ప్రశ్నించారు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు డీఏలు ఇవ్వమంటే ‘నన్ను కోసుకొని తిన్న పైసలు లేవు’ అని చెప్పిన ముఖ్యమంత్రి లక్షల కోట్ల టెండర్లు ఎలా పిలుస్తున్నాడు? అని నిలదీశారు.
ఫ్యూచర్ సిటీకి 20వేల కోట్ల టెండర్లు.. ఒకవైపు కాళేశ్వరం కూలింది అంటూనే మల్లన్న సాగర్ నుంచి మూసిలో గోదావరి నీళ్లు పోసేందుకు 7000 కోట్ల టెండర్లు.. జిహెచ్ఎంసిలో హై లెవెల్ బ్రిడ్జిలు, ఫ్లైఓవర్లు నిర్మించేందుకు మరో ఏడు వేల కోట్ల టెండర్లు.. ఫ్యూచర్ సిటీలో ఆరు లైన్ల రోడ్డు కోసం 5 వేల కోట్ల టెండర్లు.. హెచ్ఎండిఏ లో 10,000 కోట్ల టెండర్లు.. ఆర్ అండ్ బి లో 16 వేల కోట్ల టెండర్లు.. గురుకులాలను గాలికి వదిలి, 25 వేల కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు టెండర్లు.. కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషన్ 4400 కోట్ల టెండర్లు.. మూసీ సుందరీకరణకు లక్ష యాభై వేల కోట్ల టెండర్లు పిలిచారని హరీశ్‌రావు తెలిపారు. కమీషన్లు దండుకునేందుకు రెండున్నర లక్షల కోట్లకు టెండర్లు పిలుస్తున్నారని విమర్శించారు. రేవంత్ రెడ్డి.. విద్యార్థుల చదువు పట్ల నీకు శ్రద్ధ లేదా? విద్యా సంస్థలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల పట్ల ఆలోచన లేదా? అని నిలదీశారు.
ఫీజు రీయంబర్స్మెంట్ విషయమై బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తే విడతల వారీగా బకాయిలు విడుదల చేస్తామని, ఏ ఏడాదికి ఆ ఏడాది క్లియర్ చేస్తామని చెప్పిన ప్రభుత్వం సిగ్గులేకుండా మాట తప్పిందని హరీశ్‌రావు మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పెద్ద నోట్ల రద్దు, కరోనా వంటి ఆర్ధిక మాంద్యాల్లోనూ ఫీజు రీయింబర్స్మెంట్ ఆపలేదని గుర్తుచేశారు. తొమ్మిదిన్నరేళ్ల కేసీఆర్పా లనలో 20 వేల కోట్లు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించారని తెలిపారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక పరిస్థితులు తారుమారయ్యాయని అన్నారు. పెద్దమొత్తంలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడంతో విద్యాసంస్థలు నడిపించలేని పరిస్థితి వచ్చిందని తెలిపారు.. ఇప్పటికే రాష్ట్రంలో సగానికి సగం జూనియర్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయని అన్నారు. బిల్లులు కట్టక పోవడంతో కరెంట్, వాటర్ కనెక్షన్లు కట్ చేస్తున్నారని.. ఉద్యోగులకు జీతాలు ఇవ్వలేక యాజమాన్యాలు ముఖం చాటేస్తున్నాయని తెలిపారు.
ఒకవైపు ఫీజు రీయింబర్స్మెంట్ రాక, మరోవైపు ఫీజు బకాయిలు పేరుకు పోవడంతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వని పరిస్థితి నెలకొందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. సర్టిఫికెట్ల కోసం విద్యార్థులు కోర్టుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి వచ్చిందని అన్నారు. చేతగాని విధానాల వల్ల రాష్ట్రంలో విద్యావ్యవస్థ కుప్పకూలుతుంటే రేవంత్ రెడ్డి మాత్రం అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ పాఠశాలల్లో రెండు లక్షల మంది విద్యార్థులు పెరిగారని రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధం మాట్లాడారని మండిపడ్డారు. వాస్తవం ఏమిటంటే.. యూడైస్ రిపోర్ట్ ప్రకారం, ఈ విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో 47 వేల మంది పిల్లలు తగ్గారని వివరించారు.
ఒకవైపు కేసీఆర్ పై కక్షతో గురుకులాలను, మరోవైపు ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకుండా ఉన్నత విద్యా సంస్థలను నిర్వీర్యం చేస్తున్నారని సీఎం రేవంత్ రెడ్డిపై హరీశ్‌రావు మండిపడ్డారు. రెండేళ్ల పాలనలో పెండింగ్ బిల్లుల కోసం రెండు సార్లు సచివాలయంలో కాంట్రాక్టర్లు ధర్నా చేసే స్థితి వచ్చినా ఈ ప్రభుత్వానికి సిగ్గులేదని విమర్శించారు. బడా కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించి, కమీషన్లు పొందడంపై ఉన్న చిత్తశుద్ధి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించడం పై లేదని అన్నారు. ఈ ప్రభుత్వానికి కమీషన్లు దండుకోవడంపై ఉన్న ధ్యాస, విద్యా కమిషన్ ఇచ్చిన రిపోర్టు పై లేదని మండిపడ్డారు. ఇంత జరుగుతుంటే విద్యా కమిషన్ చేష్టలు అడిగి చూస్తుండడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పిన మాటలు ఏమయ్యాయని రేవంత్ రెడ్డిని హరీశ్‌రావు నిలదీశారు. గ్రీన్ చానెల్ లో నిధుల విడుదల అన్న మీ మాటలు నీటి మూటలేనా అని ప్రశ్నించారు. అతి తక్కువ కాలంలో విద్యావ్యవస్థను బ్రష్టు పట్టించిన విద్యా శాఖ మంత్రి, ముఖ్య మంత్రిగా నువ్వు చరిత్రలో నిలిచిపోతావని వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా కళ్ళు తెరిచి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేశారు. లేదంటే విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికై బీఆర్ఎస్ మరో పోరాటం చేస్తుందని హెచ్చరించారు.