Harish Rao | ఒట్లు పెట్టి దేవుళ్లను సీఎం రేవంత్ రెడ్డి మోసం చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. దేవుళ్లను మోసం చేసిన ఏకైక సీఎం రేవంత్ రెడ్డి అని విమర్శించారు. మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో శనివారం నిర్వహించిన రైతు గర్జన కార్యక్రమంలో హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారంటీలు పూర్తిగా అమలు కాలేదని అన్నారు. రుణమాఫీ విషయంలో వాయిదాలు వేస్తున్నారని విమర్శించారు.
రుణమాఫీ, రైతుబంధు, కేసీఆర్ కిట్లు, న్యూట్రీషియన్ కిట్లు ఏమయ్యాయని ప్రజలు నిలదీస్తుండటంతో రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని విమర్శించారు. అందుకే రేవంత్ రెడ్డి చిల్లర మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తండ్రి వయసు ఉన్న కేసీఆర్‌ను ఈ రకంగా అనొచ్చా అని అన్నారు. రేవంత్ రెడ్డి తిట్లకు గులాబీ గుండెలు భయపడవని స్పష్టం చేశారు. కేసీఆర్‌ది కిట్ల పాలన.. రేవంత్ రెడ్డిది తిట్ల పాలన అని ఎద్దేవా చేశారు. మూసీ మురికి కంటే కూడా రేవంత్ రెడ్డి నోటి మురికి కంపు ఎక్కువగా ఉందని విమర్శించారు. రాజకీయ నాయకుల వ్యాఖ్యలకు కూడా సెన్సార్ పెట్టాల్సిన దుస్థితి వచ్చిందని అభిప్రాయపడ్డారు. రేవంత్ రెడ్డి మాట్లాడుతుంటే A సర్టిఫికెట్ ఇవ్వాలని విమర్శించారు.
దేవుడి మీద ప్రమాణం చేసిన దేవుడిని కూడా మోసం చేసిన వ్యక్తి సీఎం రేవంత్ రెడ్డి అని హరీశ్‌రావు అన్నారు. రేవంత్ ఇచ్చిన తర్వాత బాండ్ పేపర్‌కు ఉన్న ఇజ్జత్ పోయిందని అన్నారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ మోసం చేసిందని మండిపడ్డారు. గ్యారంటీ అనే పదానికి అర్థాన్నే మార్చేసిందని విమర్శించారు. ఇప్పుడు గ్యారంటీ అంటే కూడా నమ్మేట్టు లేదని అన్నారు. ప్రజల నమ్మకాన్ని కాంగ్రెస్ వమ్ము చేసిందని అన్నారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని మోసం చేసిన కాంగ్రెస్ పార్టీపై కేసు పెట్టాలని డిమాండ్ చేశారు.
బీఆర్ఎస్ పుణ్యమా అని రైతులకు సగమైనా రుణమాఫీ అయ్యిందని హరీశ్‌రావు అన్నారు. పంద్రాగస్టులోపు రుణమాఫీ చేస్తానని సవాలు విసిరానని గుర్తుచేశారు. కానీ రుణమాఫీ కోసం వాయిదాల మీద వాయిదాలు పెడుతున్నారని విమర్శించారు. కాంగ్రెస్ వాయిదాల పార్టీ అయ్యిందని.. వాయిదాల ప్రభుత్వం అయ్యిందని ఎద్దేవా చేశారు. ఇచ్చిన మాట నిలబెట్టుకునే తెలివి కాంగ్రెస్‌కు లేదని మండిపడ్డారు.
సోషల్‌మీడియాలో ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు పెడుతున్నారని హరీశ్‌రావు మండిపడ్డారు. పోలీసులు అక్రమ కేసులు పెడతితే వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు. అక్రమ కేసులు పెడితే.. ఏపీలో మాదిరి వడ్డీతో సహా చెల్లిస్తామని అన్నారు.