Harish Rao : ‘కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం’ అనే అంశంపై రాష్ట్ర శాసనసభలో ఇవాళ చర్చ జరుగుతోంది. ఈ చర్చలో భాగంగా అన్ని పార్టీలు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నాయి. బీఆర్ఎస్ తరఫున కేటీఆర్ ఇప్పటికే మాట్లాడారు. అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం సరైన విధానాన్ని పాటించలేదని విమర్శించారు. అనంతరం తీర్మానంపై తన అభిప్రాయాన్ని వినిపించారు. ఆ తర్వాత మాజీ మంత్రి హరీశ్‌రావు మాట్లాడారు. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం పెట్టిన తీర్మానాన్ని తాము ఏకగ్రీవంగా ఆమోదిస్తామని చెప్పారు.
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు అన్యాయం జరిగిందనే విషయం వాస్తవమని హరీశ్‌రావు అన్నారు. ఈ అన్యాయంపై రాష్ట్ర ప్రభుత్వం ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్తామంటే వచ్చేందుకు తాము సిద్ధంగా ఉన్నామని అన్నారు. అంతేకాదు, బడ్జెట్లో రాష్ట్రానికి మొండిచేయి చూపినందుకు నిరసనగా సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీలో దీక్ష చేస్తానంటే తాము మద్దతిస్తామని చెప్పారు. అయితే అందుకు సీఎం రేవంత్‌రెడ్డి సమాధానం చెబుతూ.. మాజీ సీఎం కేసీఆర్ ఢిల్లీ దీక్షకు వస్తానంటే తాను తప్పకుండా దీక్ష చేస్తానని అన్నారు. ఇదిలావుంటే రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో పెట్టిన తీర్మానాన్ని నిరసిస్తూ బీజేపీ ఎమ్మెల్యేలు సభ నుంచి వాకౌట్ చేశారు.