Harish Rao | రాష్ట్రంలో వరుసగా పోలీసు కానిస్టేబుళ్లు ఆత్మహత్యలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు స్పందించారు. ములుగు జిల్లాలో ఎస్సై, సిద్దిపేటలో కానిస్టేబుల్ కుటుంబం, కామారెడ్డిలో ఎస్సై, కానిస్టేబుల్.. ఇవాళ సిరిసిల్లలో కానిస్టేబుల్ కుటుంబం, మెదక్ కుల్చారంలో హెడ్ కానిస్టేబుల్ స్వల్ప కాల వ్యవధిలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు. ప్రజల ప్రాణాలు కాపాడాల్సిన పోలీసులే వరుసగా ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తుందని పేర్కొన్నారు. వరుసగా పోలీసులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నా ప్రభుత్వానికి పట్టింపు లేదా అని ప్రశ్నించారు.
శాంతి భద్రతలు పరిరక్షించాల్సిన రక్షకుల జీవితాలకే రక్షణ కరవైందని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తం చేశారు. పని ఒత్తిళ్లు, పెండింగ్ హామీలను తీర్చడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి పోలీసులపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నదని తెలిపారు. ఈ ఆత్మహత్యలపై నిజానిజాలు వెలుగులోకి రావడానికి శాఖాపరమైన దర్యాప్తు చేయాలని తెలంగాణ రాష్ట్ర డీజీపీని విజ్ఞప్తి చేశారు. పోలీసుల్లో ఆత్మహత్యల ఆలోచనలు రాకుండా సైకాలజిస్టులతో కౌన్సెలింగ్ నిర్వహించాలని కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.
పోలీసు మిత్రులారా.. సమస్యలు ఏమైనప్పటికీ ఆత్మహత్యలు పరిష్కారం కాదని హరీశ్‌రావు సూచించారు. ఎంతో కష్టపడి పోలీసు ఉద్యోగాలు సాధించారని.. మీ కుటుంబసభ్యులు, తల్లిదండ్రులు మీపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకండి అని హితవు పలికారు. విలువైన జీవితాలను కోల్పోవద్దని సలహానిచ్చారు. ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన పోలీసులు ఆత్మస్థైర్యంతో విధులు నిర్వహిస్తేనే సమాజానికి భద్రత ఉంటుందన్నారు.