Harish Rao | ప్రజల ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహించడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు మండిపడ్డారు. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో ఊరు ఊరంతా డయేరియా బారిన పడి ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అని నిలదీశారు.
కామారెడ్డి జిల్లాలో కలుషిత నీరు తాగి తండ్రీకొడుకులు మృతి చెందటం అత్యంత బాధాకరమని హరీశ్ రావు అన్నారు. శుభ్రమైన తాగునీటి సరఫరాలో రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్ విఫలమైందని విమర్శించారు. పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీరాజ్ విభాగం విఫలమైందని.. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో నష్టనివారణ చర్యలు చేపట్టడంలో రెవెన్యూ శాఖ విఫలమైందని అన్నారు. మొత్తంగా పల్లెలు, గ్రామాల ప్రజలకు సురక్షితమైన నీరు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయ్యిందని అన్నారు. దేమికలాన్ గ్రామంలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి, వెంటనే మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.