Harish Rao | సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి నిఖిల్ మరణం చాలా బాధాకరమని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఈ కష్టసమయంలో వారి కుటుంబసభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుణ్ని ప్రార్థించారు. 83 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే కనీస దిద్దుబాటు చర్యలు చేపట్టని కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి, ఈ మరణం మరొక ఉదాహరణ అని ఆయన అన్నారు.
చిన్న జ్వరానికే విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి రావడం శోచనీయమని హరీశ్‌రావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో గురుకులాల నిర్వహణ వైఫల్యానికి ఇదొక నిదర్శనమని మండిపడ్డారు. ఒక గురుకులంలో 400 మంది విద్యార్థులనే సమర్థవంతంగా చూసుకోలేని ప్రభుత్వం.. 2000 మంది ఉండే ఇంటిగ్రేటెడ్ పాఠశాలల నిర్వహణను ఎలా చేయగలదని నిలదీశారు. గురుకులాల్లో చదువుతున్న దళిత, బహుజన విద్యార్థుల ప్రాణాలను రక్షించే చర్యలు చేపట్టాలని సూచించారు. చనిపోయిన విద్యార్థి నిఖిల్ కుటుంబానికి రూ.15 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని బీఆర్ఎస్ తరపున డిమాండ్ చేశారు.
సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండలం నల్లవాగు సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి నిఖిల్ మరణం చాలా బాధాకరం. ఈ కష్ట సమయంలో వారి కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నాను.
83 మంది గురుకుల విద్యార్థులు చనిపోతే కూడా కనీస… pic.twitter.com/vjGW4mUJ6S
— Harish Rao Thanneeru (@BRSHarish) March 29, 2025
ఏం జరిగిందంటే..
పెద్డ శంకరంపేట మండలం చీలపల్లి గ్రామానికి చెందిన దార నిఖిల్ కుమార్ (14) సిర్గాపూర్ మండలం పరిధిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. ఆహారం బాగోలేకపోవడంతో వారం రోజులుగా అతను సరిగ్గా భోజనం చేయడం లేదు. దీంతో విద్యార్థి ఆరోగ్యం విషమించింది. ఈ విషయాన్ని నిఖిల్ తల్లిదండ్రులకు గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ తెలియజేశాడు. కంగారుపడిపోయిన తల్లిదండ్రులు వెంటనే పాఠశాలకు చేరుకుని.. నిఖిల్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. నారాయణఖేడ్‌లోని ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లగా.. సంగారెడ్డికి తీసుకెళ్లాలని వైద్యులు సూచించారు. అక్కడ ప్రైవేటు ఆస్పత్రిలో పరీక్షలు చేసిన వైద్యులు.. పరిస్థితి విషమంగా ఉందని.. మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ తీసుకెళ్లాలని సూచించారు. హైదరాబాద్‌లోని ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం విద్యార్థి నిఖిల్ మృతిచెందాడు.