Harish Rao | ప్రతి చిన్న గ్రామానికి ప్రైమరీ స్కూల్, ప్రతి రెవెన్యూ గ్రామానికి అప్పర్ ప్రైమరీ స్కూల్, హైస్కూల్ ఏర్పాటు చేస్తామని అభయహస్తం మేనిఫెస్టోలో కాంగ్రెస్ పార్టీ ప్రగల్భాలు పలికారని బీఆర్ఎస్ నేత హరీశ్‌రావు అన్నారు. అధికారంలోకి వచ్చి సంవత్సరం కాకముందే జీరో స్కూల్ పేరిట 1,899 స్కూల్లు, 10 మందిలోపు విద్యార్థులు 4,314 స్కూళ్లు మొత్తం కలిపి 6,213 స్కూల్స్‌ని శాశ్వతం గా మూసి వేసే ప్రణాళిక లో భాగంగానే ఆ స్కూల్లో పనిచేసే 5,741 మంది టీచర్లను బదిలీ చేస్తున్నారని మండిపడ్డారు.
కేసీఆర్ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం కోసం 7,289 కోట్లతో మన ఊరు – మన బడి, ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం సన్న బియ్యంతో పౌష్ఠిక ఆహారం అందించారని హరీశ్‌రావు తెలిపారు. రేవంత్ సర్కారు వచ్చీ రాగానే సీఎం బ్రేక్ ఫాస్ట్ స్కీం రద్దు చేయడం, మన ఊరు మన బడి ప్రోగ్రాం కొనసాగించకపోవడం, పురుగులన్నం, విషాహారంతో మధ్యాహ్న భోజనం వల్ల ప్రభుత్వ పాఠశాల పరపతి తగ్గి ఎన్రోల్మెంట్ తగ్గుతోందని పేర్కొన్నారు. ఒక్క సంవత్సరం లోనే 6,213 ప్రభుత్వ స్కూల్స్ మూత పడే దుస్థితికి రేవంత్ సర్కారు దిగజార్చిందని మండిపడ్డారు.